సమస్యలు పరిష్కరించండి సారూ...
చిత్తూరు (అగ్రికల్చర్) : జిల్లాలో నలుమూలల నుంచి వందలాది మంది ప్రజలు సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి విచ్చేశారు. జిల్లా కలెక్టరేట్ సిద్ధార్థ్‌జైన్‌కు పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అర్జీలిచ్చారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైనప్రజావాణి కార్యక్రమం మధ్యాహ్నం 1.30 గంటల వరకు సాగింది. కలెక్టర్‌తో పాటు ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, ఆర్డీవో విజయచంద్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
చక్కెర ఫ్యాక్టరీ కార్మికుల గోడు ఇదీ
చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణిలో విన్నవించారు. ఫ్యాక్టరీ పరిధిలోని దాదాపు నాలుగు వందల మంది కార్మికులకు 18 నెలలుగా రూ.8 కోట్ల మేరకు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఫ్యాక్టరీ పరిధిలోని కార్యాలయం, కార్మికులకు తాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల్లో ముస్లిం సోదరులకు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నమాజుకు వె ళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కార్మికులకు ఒక నెల వేతనం అడ్వాన్స్‌గా ఇవ్వాలన్నారు. కలెక్టర్‌ను కలిసినవారిలో కార్మిక సంఘాధ్యక్షుడు వెంకటప్రసాద్, ఉపాధ్యక్షులు కుమార్, జయన్, ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, కార్మికులు ఉన్నారు.
అర్హత ఉన్నా పింఛన్ ఇవ్వలేదు
తనకు వికలాంగుడిగా పూర్తి స్థాయిలో అర్హత ఉన్నట్లు ధ్రువీకరణపత్రం ఉన్నా సామాజిక పింఛన్ ఇవ్వలేదని పెనుమూరు మండలం అమ్మగారిపల్లెకు చెందిన మనోహర్ వినతిపత్రం సమర్పించారు. తనకు 82 శాతం వికలత్వం ఉన్నట్లు సదరన్ ధ్రువీకరణపత్రాన్ని ఇచ్చిందని, ప్రభుత్వం నెలకు రూ.1,500 చొప్పున పింఛన్ కూడా మంజూరు చేసిందని తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో పింఛన్ ఇచ్చారని, తరువాత గ్రామంలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో మండలస్థాయి అధికారులు తనకు పింఛన్ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాను ఈ ఏడాది ఏప్రిల్ 27న కోర్టును ఆశ్రయించానని, కోర్టు తనకు పింఛన్ ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. కోర్టు ఉత్తర్వులను సైతం అధికారులు బేఖాతర్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తాను నిరుపేదనని, పనులు చేయడానికి వీలుకాని పరిస్థితుల్లో ఉన్నానని కలెక్టర్‌కు మొరపెట్టుకున్నాడు. పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని వినతిపత్రం సమర్పించాడు.
పనులు చేయలేం... సాయం చేయండి
తనకు సామాజిక పింఛన్ ఇప్పించాలని కలకడ మండలం దేవళపల్లె గ్రామానికి చెందిన ఆర్.లక్ష్మయ్య (75) జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు వినతి పత్రం సమర్పించారు. తనకు ఎలాంటి వ్యవసాయ భూములు లేవని, కూలీ పనులతోనే జీవనం సాగిస్తున్నానని తెలి పారు. ప్రస్తుతం తాను, తన భార్య ఎల్లమ్మ వృద్ధాప్యంతో పనులు చేసుకోలేకున్నామని, తమకు పింఛన్ మంజూరు చేయాలని కోరారు.
వర్షపు నీటిని వృథా కానీయకండి
వర్షపునీటిని వృథా కానీయకుండా చర్యలు తీసుకోవాలని పాకాల మండలం సూరినాయనిపల్లె గ్రామస్తులు కలెక్టర్‌ను కోరారు. తమ గ్రామ సమీపంలో కొండపై పడే వర్షపునీటిని సప్లై చానల్ ద్వారా వంకలో కలిసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే కొందరు ఆ నీటిని తమ పొలాల్లోని మామిడి చెట్లకు మళ్లించుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకుని నీటిని వృథా కానీయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.