గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్)/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీ లను నెరవేర్చకుండా, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా పార్లమెంట్‌లో కేంద్రం అనుసరించిన వైఖరికి నిరసనగా ఈనెల 16న రాష్ట్ర బంద్ పాటించాలని హోదా, విభజన హామీల సాధన సమితి పిలుపునిచ్చింది. బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. సీపీఎం, సీపీఐలతోపాటు జనసేన కూడా మద్దతు తెలిపాయి.
ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని ఐదుకోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలపాలని సాధన సమితి అధ్యక్షుడు చల సాని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. విభజన హామీల అమలుపై కేంద్ర తీరుకు నిరసనగా గురువారం విజయవాడ లెనిన్ సెంటర్‌లో నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు.
నాలుగేళ్లుగా పోరాటం: ప్రత్యేక హోదా సాధనకోసం నాలుగేళ్లుగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నేతృత్వంలో పలు రూపాల్లో పోరాటం చేస్తున్నామని పార్టీ బందరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఏపీ భవన్‌లో నిరాహార దీక్షలు సైతం చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment