మిర్చి రైతు దిగాలు | suffer chilli farmers for minimum cost of price | Sakshi
Sakshi News home page

మిర్చి రైతు దిగాలు

Published Wed, Feb 4 2015 4:49 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

suffer chilli farmers for minimum cost of price

గుంటూరు: మిర్చికి గిట్టుబాటు ధర లేక రైతులు దిగాలు చెందుతున్నారు. రెండు నెలల క్రితం క్వింటాలు మిర్చి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ధర పలికింది. పంటపూర్తిగా చేతికొచ్చి రైతులు యార్డుకు తెచ్చే సరికి రూ.7 వేల నుంచి రూ.8 వేలు మాత్రమే పలుకుతోందని గుంటూరు జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గిట్టుబాటు కావడంలేదని కొందరు మిర్చి బస్తాలను ఏసీల్లో నిల్వ ఉంచుతుంటే పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చేందుకు మరికొందరు  ప్రస్తుతం ఉన్న ధరకే విక్రయిస్తున్నారు. ఈ ఏడాది మిర్చి దిగుబడి కూడా తక్కువ గా ఉందని రైతులు తెలుపుతున్నారు. గిట్టుబాటు ధర లేక  ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని వాపోతున్నారు.

సిండికేట్ వల్ల ధర తగ్గిందా...?
మిర్చి సీజన్ ప్రారంభం కావడంతో వ్యాపారస్తులు సిండికేట్ అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వాలిటీ మిర్చిని తెచ్చినా కనీస ధర లభించడం లేదు. వ్యాపారులంతా ఒకే ధర చెబుతుండ టంతో సిండికేట్ అయినట్లు అర్థమవుతోందని రైతులు చెబుతున్నారు. రవాణా ఖర్చులు భరించి గుంటూరు మిర్చి యార్డుకు కాయలు తరలిస్తున్నా, వ్యాపారులు సిండికేట్ కావడం వల్లే ధర తగ్గినట్లు రైతులు చెబుతున్నారు. రెండు నెలల కిందట రూ.12 వేల వరకు ఉంటే సీజన్ ప్రారంభంలోనే ధర ఎందుకు తగ్గిందో అర్థం కావడంలేదని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ వ్యాపారులు కూడా కాయలో నాణ్యత లేదని ధర తగ్గించి మోసం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.అదే విధంగా కాటాల్లో మోసం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement