నూతన ఎస్పీగా డాక్టర్ గజరావు భూపాల్
నెల్లూరు(క్రైమ్): జిల్లా ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్ గ్రూప్ కమాండర్ గ్రేహౌండ్స్, హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో డీజీ వీఆర్‌లో ఉన్న డాక్టర్ గజరావు భూపాల్‌ను నియమిస్తూ బుధవారం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 15 మంది ఎస్పీలను బదిలీచేశారు. అందులో భాగంగా ఎస్పీ సెంథిల్‌కుమార్ బదిలీ అయ్యారు.
38వ జిల్లా ఎస్పీగా సెంథిల్‌కుమార్ గతేడాది జూలై 30న బాధ్యతలు స్వీకరించారు. 8 నెలల పాటు ఎస్పీగా కొనసాగారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి జిల్లాలో అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. వరుస దాడులతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. అంతర్జాతీయ స్మగ్లర్ మూసా అరెస్ట్‌లో కీలకభూమిక పోషించారు.
విధి నిర్వహణలో అలసత్వం, అవినీతి, అక్రమాలకు పాల్పడిన పలువురు సిబ్బందిపై కఠినచర్యలు తీసుకొన్నారు. దీంతో జిల్లా పోలీసుశాఖలో అవి నీతి, అక్రమాలకు పాల్పడితే ఎంతటివారిపైనైనా చర్యలు తప్పవన్న సంకేతాన్ని పంపారు. పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి తొలిసారిగా వారధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు తమ సమస్యలను ఉన్న ప్రాంతం నుంచే ఫిర్యాదు చేసేందుకు స్పందన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాలు సఫలీకృతమయ్యాయి.
ప్రధానంగా ఎర్రచందనం, బియ్యం, ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు కృషిచేయడంతో పాటు భారీగా కేసులు నమోదు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరిస్తున్న కొందరు అటవీశాఖ సిబ్బందిపైనా కేసులు నమోదు చేయడం, జాక్‌పాట్ లారీలపై ఉక్కుపాదం మోపడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది.
ఒక దశలో అప్పటి అటవీశాఖ అధికారి ఎస్పీ వ్యవహారశైలిపై బహిరంగ విమర్శలు చేసిన విషయం విదితమే. రాజకీయాలకు దూరంగా ఉంటూ తనదైన శైలిలో ముందుకు వెళ్లారు. దీంతో రాజకీయ నాయకులు ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎస్పీ వ్యవహారశైలిపై ఆది నుంచే అధికార పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ బహిరంగంగానే ఎస్పీపై విమర్శలు గుప్పించడంతో పాటు ఎస్పీని బదిలీ చేయిస్తామన్నారు.
ఎస్పీ తమకు ఏ పనిచేయడం లేదని జిల్లాకు చెందిన అధికారపార్టీ నేతలు పలు దఫాలు జిల్లా మంత్రితో పాటు సీఎంకు సైతం ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎస్పీ బదిలీ జరిగిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అసలు విధులను వదిలివేసి కొసరు విధులకు ప్రాధాన్యమివ్వడంతో జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయన్న విమర్శలను మూటగట్టుకున్నారు.
కాకినాడ వాసి :
గజరావు భూపాల్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందినవారని తెలిసింది. కాకినాడలోని ఆదిత్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. ఆంధ్రా క్యాడర్ 2008 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. భద్రాచలం, మెదక్ జిల్లాలో ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం పదోన్నతిపై ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేశారు. గతేడాది అక్టోబర్‌లో ఆయన డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఏపీ క్యాడర్‌కు ఆయన వచ్చారు. ఏపీ క్యాడర్‌లో తొలిసారిగా జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. విధి నిర్వహణలో రాజీలేని వ్యక్తిగా ఆయనకు పేరుంది.