మహారాణిపేట : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభ సబార్డినేట్ కమిటీ చైర్మన్ టి.సుబ్బిరామిరెడ్డి డిమాండ్ చేశారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆధ్వర్యంలో ఆదివారం బీచ్‌రోడ్‌లోని ఓ హోటల్‌లో ‘ఆంధ్రాకు ప్రత్యేక హోదా- విశాఖ అభివృద్ధి’పై చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్ట విభజన చేసి నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన బీజేపీ ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టిందని విమర్శించారు. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీచేసిన టీడీపీ ప్రత్యేక హోదా అడగడానికి ఎందుకు వెనుకడుగువేస్తోందో అర్థం కావడంలేదన్నారు.
రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అడ్డంకాదని రాజకీయాలకు అతీతంగా సహకరిస్తుందన్నారు. విశాఖకు రైల్వేజోన్ తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ, టీడీపీలు ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. తమ హయాంలో చేసిన భూసంస్కరణల జీవోలను దొంగచాటుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
కందాల-కృపారాణిల మధ్య వాగ్వాదం
న్యాయవాది కందాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో కూడా భూ ఆక్రమణలు జరిగాయని చెప్పగా కృపారాణి జోక్యం చేసుకొని కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎక్కడ భూ ఆక్రమణలు జరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కందాలను నిలదీశారు. దీంతో ఆయన వేదికపై నుంచి దిగిపోయారు. ఆయనతో వచ్చిన కొంతమంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఎస్సార్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో సీపీఎం నేత గంగారామ్, సీపీఐ నేత బి.పైడిరాజు, కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు సిహెచ్.రాఘవేందర్రావు, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్.ఎస్.శివశంకర్, హ్యూమన్ రైట్స్ వేదిక ప్రతినిధి శ్యాంప్రసాద్, గ్రేటర్ విశాఖ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు నరవ రాంబాబు, ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ కన్వీనర్ జె.టి.రామారావు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, పేడాడ రమణకుమారి, గుంటూరు భారతి, తదితరులు పాల్గొన్నారు.
'ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే'
Published Mon, Feb 2 2015 6:25 AM | Last Updated on Tue, Jul 24 2018 1:16 PM
Advertisement
Advertisement