బుధవారం టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు
- షరీఫ్, జూపూడి నేడు నామినేషన్
హైదరాబాద్: శాసనసభ కోటాలో శాసనమండలికి జరిగే ఎన్నికల్లో, గవ ర్నర్ నామినేటెడ్ కోటాలో టీడీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. మాజీ మంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (నెల్లూరు), పార్టీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ (కృష్ణా), పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి టీడీ జనార్దనరావు (కృష్ణా), చిత్తూరు జిల్లా పార్టీ కన్వీనర్ గౌనివాని శ్రీనివాసులు (చిత్తూరు), ఎంఏ షరీఫ్(పశ్చిమ గోదావరి), జూపూడి ప్రభాకర్‌రావు(ప్రకాశం)లను రెండు కేటగిరీల్లో పెద్దల సభలో ప్రవేశించనున్నారు. షరీఫ్, జూపూడిల పేర్లను ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేయగా వీరు గురువారం నామినేషన్లను దాఖలు చేయనున్నారు.
గవర్నర్ నామినేటెడ్ కోటాలో సోమిరెడ్డి, జనార్దన్, అనురాధ, శ్రీనివాసులు పేర్లను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఖరారు చేశారు. వీరి పేర్లను మంత్రివర్గం ఆమోదించిన తరువాత గవర్నర్‌కు పంపుతారు. పాలడుగు మృతితో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు జరిగే ఎన్నికల్లో జూపూడి పోటీ చేయనున్నారు. ఆయన పదవీ కాలం రెండేళ్లు ఉంటుంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల నామినేషన్ దాఖలు చేయడానికి గురువారంతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం చంద్రబాబు పొలిట్‌బ్యూరోను సమావేశపరిచి అభ్యర్థులను ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ప్రస్తుతం నాలుగు స్థానాలకు (ఒక స్థానానికి ఉప ఎన్నిక కలిపి) ఎన్నికలు జరుగుతుండగా, వీటిలో మూడు స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో వైఎస్సార్‌సీపీ గెలుచుకునే సంఖ్యా బలం ఉంది. అయితే టీడీపీ తన మిత్రపక్షమైన బీజేపీకి ఒక స్థానం వదులుకోగా ఆ పార్టీ సోము వీర్రాజు పేరును ఖరారు చేసింది. షరీఫ్‌ను మైనారిటీ కోటాలో ఎంపిక చేశారు.
స్థానిక సంస్థల కోటాలో..
స్థానిక సంస్థల కోటాలో టీ డీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు. గాలి ముద్దు కృష్ణమనాయుడు (చిత్తూరు), పయ్యావుల కేశవ్ (అనంతపురం), వైవీబీ రాజేంద్రప్రసాద్, బచ్చుల అర్జునుడు (కృష్ణా), రెడ్డి సుబ్రహ్మణ్యం (తూర్పు గోదావరి), మాగుంట శ్రీనివాసులరెడ్డి (ప్రకాశం), శిల్పా చక్రపాణిరెడ్డి (కర్నూలు), పప్పుల చలపతి రావు (విశాఖ), సత్యం (విజయనగరం) ఖరారైన వారిలో ఉన్నారు. ఇంకా, గుంటూరు జిల్లా నుంచి రెండు స్థానాల పేర్లు నిర్ణయించాల్సి ఉంది. పార్టీ నేతలు మల్లెల లింగారెడ్డి, బీర రవిచంద్రయాదవ్, వర్ల రామయ్య, జేఆర్ పుష్పరాజ్‌లకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయించారు.