అభ్యర్థులు కావలెను! | TDP looking for candidates | Sakshi
Sakshi News home page

అభ్యర్థులు కావలెను!

Published Thu, Dec 12 2013 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

TDP looking for candidates

 సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధినేత రెండు కళ్ల సిద్ధాంతం.. స్థానికంగా వెన్నుపోటు రాజకీయాలతో తెలుగుదేశం పార్టీ జిల్లాలో ఉనికి కోల్పోతోంది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన పార్టీ నేడు మిణుకుమిణుకుమంటోంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో  ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయంలో ఇప్పటికీ స్పష్టత కరువైంది. ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న వారికి సీటు వస్తుందో రాదో తెలియని సందిగ్ధం నెలకొంది. అధిక శాతం అభ్యర్థులు సైతం పోటీ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ స్థానాల్లో పోటీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఫరూక్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయన అసెంబ్లీ నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఈ పరిస్థితిలో అభ్యర్థి ఎంపిక విషయమై స్వయంగా పార్టీ అధినేత రంగంలోకి దిగినా ఫలితం లేకపోయిందనే చర్చ జరుగుతోంది. కొందరు కాంగ్రెస్ నాయకులను సంప్రదించినా వారు ముందుకు రాలేదని సమాచారం. పోటీకి సుముఖంగా లేమని కొందరు ముఖం మీదే చెప్పినా.. ఇంకొందరు కార్యకర్తలతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని దాటవేసినట్లు తెలిసింది. అభ్యర్థి వేటలో ఆ పార్టీ శ్రేణులు తొక్కని గడప లేదంటే అతిశయోక్తి కాదు. కర్నూలు పార్లమెంట్ స్థానం విషయానికొస్తే పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ పేరు ప్రచారంలో ఉంది. మొదట డోన్ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి పేరు తెరపైకి వచ్చినా.. ఆయన డోన్ నుంచే పోటీ చేస్తానని పత్రికా ముఖంగా ప్రకటించారు. అయితే ఇక్కడా అభ్యర్థి విషయంలో స్పష్టత కరువైంది. ఇకపోతే అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది.

కర్నూలు, నందికొట్కూరు, ఆలూరు, ఆళ్లగడ్డ, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుత ఇన్‌చార్జీలు కేవలం పార్టీ కార్యక్రమాల నిర్వహణకే పరిమితమని.. వారే అభ్యర్థులని చెప్పలేమని ఓ ముఖ్య నాయకుడు తెలిపారు. అభ్యర్థులే దొరకని పరిస్థితుల్లోనూ ఆ పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సమైక్య ఉద్యమంలో ప్రజలతో కలిసి నడవకుండా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలనే ప్రశ్న ఆ పార్టీ నాయకులను వేధిస్తోంది. ఇదిలాఉంటే కర్నూలు టీడీపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డిని బయటకు వెళ్లగొట్టిన నాయకులే ప్రస్తుతం మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరికి పొగ పెడుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. చౌదరి నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు ద్వారా పార్టీ తీర్థం పుచ్చుకోవడాన్ని కొందరు జిల్లా నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ప్రాబల్యాన్ని తగ్గించే చర్యలు తెర వెనుక ముమ్మరమైనట్లు తెలుస్తోంది.  వెన్నుపోటు రాజకీయాలతో పా ర్టీ దిగజారుతుండటం పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement