జజ్జెనకరి జనారే | Telangana celebrations in Hyderabad | Sakshi
Sakshi News home page

జజ్జెనకరి జనారే

Published Wed, Feb 19 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM

జజ్జెనకరి జనారే

జజ్జెనకరి జనారే

 తెలంగాణ ఆయారే..
 ఊరూరా ఉద్యమకారుల సంబురాలు
 పల్లె పల్లెనా పండుగలా ఆనందోత్సాహాలు
 కదిలివచ్చిన పార్టీలు, వివిధ సంఘాల నేతలు
 ఉత్సాహంతో నృత్యాలు చేసిన ప్రజలు
 టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ

 
 సాక్షి, నెట్‌వర్క్: ఆత్మగౌరవం.. స్వయంపాలన కోసం.. ఆరుదశాబ్దాలపాటు తెలంగాణ ప్రజలు సాగించిన సుదీర్ఘపోరాటం ఫలించింది.  ఉద్యమ పతాక ఉవ్వెత్తున లేచింది. తెలంగాణ గెలిచింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును మంగళవారం లోక్‌సభ ఆమోదించిన నేపథ్యంలో పది జిల్లాల్లో సంబురాలు అంబరాన్ని తాకాయి. ప్రజలంతా   తెలంగాణ జెండాలు చేబూని స్వరాష్ట్ర ఏర్పాటును స్వాగ తించారు.
 
 
  తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు.  టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీఆర్‌ఎల్‌డీ, ఎంఎస్‌పీ, వివిధ ఉద్యోగ, న్యాయవాద, ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజాఫ్రంట్, టీఎన్‌ఎస్, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి.
 
 వరంగల్ జిల్లాకేంద్రంతోపాటు వర్ధన్నపేట, ములుగు, పరకాల, ఏటూరునాగారం, నర్సంపేట, మహబూబాద్, డోర్నకల్, తొర్రూరు, పాలకుర్తి, మరిపెడ సెంటర్‌లలో తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరి ఆనందోత్సాహంతో ఆలింగనాలు చేసుకున్నారు. హన్మకొండలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  వరంగల్ జిల్లా కలెక్టర్ కిషన్ ఉద్యోగులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు.  
 
 ఆదిలాబాద్ తెలంగాణచౌక్‌లో రహదారిపై టపాసులు కాల్చి, నృత్యాలు చేశారు.  కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు జరిగాయి. బీజేపీ, సీపీఐ ఎంఎల్, బీఎస్పీ, ఎంబీటీ  తదితర పార్టీలు ర్యాలీలు నిర్వహించాయి. న్యాయవాదులు, పలు శాఖల ఉద్యోగులు ఆనందోత్సవాలతో నృత్యాలు చేశారు. కలెక్టరేట్ ఉద్యోగులు మిఠాయిలు పంచుకున్నారు. మంచిర్యాల, కాగజ్‌నగర్, నిర్మల్,లక్షెట్టిపేట్, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఊట్నూర్, భైంసాలో ర్యాలీలు జరిగాయి.
 
  సింగరేణి బొగ్గు గనులపై కార్మికులు సంబరాలు జరుపుకొన్నారు.
 కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ నాయకులు  వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యాసంస్థలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. హుజూరాబాద్, రామగుండం, జగిత్యాల, హుస్నాబాద్, పెద్దపల్లి, చొప్పదండి, మానకొండూరు తదితర నియోజకవర్గాల్లో   సంబరాలు జరుపుతూ.. మిఠాయిలు పంపిణీ చేశారు.
 
 నిజామాబాద్‌లో టీజేఎసీ ప్రతినిధులు, ఉద్యోగులు, యువకులు, విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, రహదారులపైకి చేరి జయజయధ్వానాలు చేశారు. టీ జేఏసీ ప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు,  న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో  కామారెడ్డి, ఆర్మూరు, బోధన్, ఎల్లారెడ్డి, బాన్సువాడల్లో సంబురాలు జరిగాయి.
 
 ఖమ్మంలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన, కుల సంఘాలు, మైనార్టీలు, కార్మికులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి సంబరం చేసుకున్నారు.  నల్లగొండ జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. వివిధ పార్టీలు, ఉపాధ్యాయ, విద్యార్థి, ఉద్యోగసంఘాలు కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాయి. తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పలువురు తెలంగాణవాదులు పాలాభిషేకం చేశారు.
 మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో టీఎన్‌జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు, జేఏసీ జిల్లా ఛైర్మన్ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు.
 
 
  వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచకుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఐఎంఎల్, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. షాద్‌నగర్, జడ్చర్ల, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, మక్తల్, నారాయణపేట, కొడంగల్, అలంపూర్, దేవరకద్ర, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో సంబురాలు జరుపుకొన్నారు.
 
  కేశంపేట మండలం పాటిగడ్డతండాకు చెందిన కవి, గాయకుడు పాపగంటి శేఖర్ (28)  షాద్‌నగర్ విజయోత్సవ ర్యాలీలో   గుండెపోటుతో మృతి చెందాడు. మెదక్  జిల్లాలో తెలంగాణవాదుల సంబరాలు అంబరాన్నంటాయి. ఉద్యమ పురిటిగడ్డలో విజయోత్సవ వేడుకలు హోరెత్తాయి.  జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీ జేఏసీ, సీపీఐ, కొన్నిచోట్ల టీడీపీ నాయకులు వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకొన్నారు. సంగారెడ్డిలో అమరవీరుల స్థూపానికి క్షీరాభిషేకం చేశారు.
 
 రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సంబరాలు మిన్నం టాయి. పరిగి, తాండూరు, చేవెళ్ల, శంషాబాద్, తాండూరు, వికారాబాద్, మేడ్చల్, ఇబ్రహీంపట్నంలో తెలంగాణ వాదులు సంబరాలు చేసుకున్నారు. రంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు, మండలాల్లో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు.
 
 హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీభవన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీల నేతలు, కార్యకర్తలు వేడుకల్లో మునిగితేలగా... సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఓయూలో 25న పూర్తిస్థాయిలో విజయోత్సవాలు నిర్వహిస్తామని టీఎస్ జేఏసీ ప్రకటించింది. తెలంగాణ భవన్‌లో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నేతలు బాజాభజంత్రీల మధ్య నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
 
  తెలంగాణ తెస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకున్నామని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించింది. బిల్లు ఆమోదం పొందిన అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. జంట నగరాల పరిధిలోని అన్ని కోర్టులతోపాటు రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు.
 
 ఆశయం నెరవేరింది
 తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేయడంతో  తెలంగాణ మలిఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్‌చారితోపాటు వెయ్యి మంది అమరవీరుల ఆశయం నెరవేరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమవుతున్న వేళ శ్రీకాంత్‌చారి తల్లిదండ్రులుగా ఎంతో సంతృప్తి చెందుతున్నాం. మలి ఉద్యమానికి మా కొడుకు త్యాగం ఎంతో  స్ఫూర్తినిచ్చింది. లక్ష బాధలు పడి తెలంగాణ లక్ష్యాన్ని కేసీఆర్ సాధించారు. రాష్ట్ర సాధనకోసం లెక్కలేని అభాండాలు, అపనిందలు తనపై మోపినా కేసీఆర్ భరించారు. తెలంగాణ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఇప్పటికైనా సీమాంధ్రులు ఉద్యమాన్ని విరమించుకోవాలి. ఎలాంటి ఆటంకాలు లేకుండా హైదరాబాద్‌లో కలిసిమెలిసి  బతకవచ్చు.
 - శ్రీకాంత్‌చారి తల్లిదండ్రులు శంకరమ్మ-వెంకటాచారి
 
 అమరుల త్యాగఫలితం
 ‘తెలంగాణ కోసం నా భర్త (కానిస్టేబుల్ కిష్టయ్య) తన జీవితాన్నే త్యాగం చేశారు. ఆయన లేకపోవడం మాకు ఎంతో నష్టం.  ఆ బాధ ఉన్నా రాష్ట్రం రావడం ఆనందం కలిగిస్తోందన్నారు. ఆయనతోపాటు ఎందరో అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం. ఆయన స్వప్నం నెరవేరడం సంతోషం. సోనియమ్మకు కృతజ్ఞతలు. తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకోవాలి’
 - కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మ
 
 అన్యాయం తొలగిపోయింది
 సీమాంధ్ర నాయకులు ఏళ్లసంది దోచుకున్నరు, ఇప్పటికైనా తెలంగాణ ఇవ్వడం సంతోషం... మా గ్రామానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటనకు వచ్చినప్పుడు ఏం కావాలని నన్ను అడిగితే.. తెలంగాణ కావాలని చెప్పిన. అప్పుడు ఆయన తెల్లమొహం పెట్టుకొని పోయిండు. నేను అప్పుడు అట్ల అడిగినందుకు యువకులకు స్పూర్తిని ఇచ్చినట్టయింది. ఇప్పడు తెలంగాణ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. మా ఉద్యోగాలు, మా నీళ్లు మాకు దక్కుతాయి. సీమాంధ్రులు ఇప్పటికైనా ఆందోళన విరమించుకుంటే మంచిగుంటది.-న్యూస్‌లైన్,రాయపర్తి
 - తెలంగాణ వాది పనికర మల్లయ్య, రాయపర్తి, వరంగల్ జిల్లా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement