సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలుగుదేశం, బీజేపీ పొత్తు వ్యవహారం జి ల్లాలో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు బీజేపీతో పొత్తుల విషయాన్ని హైదరాబాద్‌లో చర్చించడం, ఇదే విషయమై ఆ పార్టీకి చెందిన ఎంపీ రాథోడ్ రమేశ్ జిల్లాలో ప్రస్తావించడం రాజ కీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో ఒక్కడుగు ముందుకేసిన బీజేపీ జిల్లా నాయకులు టీడీపీతో పొత్తు వద్దంటూ అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా తీర్మానాలు చేస్తున్నారు. మంగళవారం ఆదిలాబాద్ నియోజకవర్గంలో తీర్మానించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు సిద్ధమైన కొం దరు టీడీపీ నేతలు వేచిచూసే ధోరణిలో ఉన్నా రు. మరికొందరు నేతలు తాజా పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో చేరడమా? టీడీపీలో కొనసాగడమా? అన్న అంతర్మథనంలో పడ్డారు.పొత్తులపై స్పష్టత లేదంటున్న బీజేపీ నాయకులు బీజేపీ, టీడీపీ పొత్తులపై జిల్లాలో ఊహాగానాలు జోరందుకున్నాయి. పొత్తుల విషయమై స్పష్టత లేదని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంగా కూడా తమ పార్టీ అగ్రనేతలు ప్రకాశ్ జవదేకర్, రాజ్‌నాథ్ సింగ్ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన పార్టీలతో పొత్తు ఉండబోదన్న విషయాన్ని ప్రస్తావించారన్నారు. పొత్తుల విషయమై తమ పార్టీ నాయకత్వం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమన్న కూడా ప్రకటించారు. బీజేపీ, టీడీపీ మధ్య పొత్తుల ప్రసక్తే లేదని బీజేపీ నేతలు కుండబద్దలు కొట్టినట్లు చెప్తుండగా టీడీపీకి చెందిన జిల్లా నేతలు దాదాపు పొత్తు ఖాయమైనట్లేనన్న రీతిలో వ్యవహరిస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. ఇదిలా వుంటే.. ప్రధానంగా టీడీపీ, కాంగ్రె స్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల తీర్థం కోసం సిద్ధమయ్యారన్న ప్రచారం జరిగింది. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్, బీజేపీతో టీడీపీల పొత్తులు అనివార్యమన్న ప్రచారం జోరందుకోవడంతో వలసనేతలు సందిగ్ధంలో పడ్డారు. తాజాగా టీడీపీతో పొత్తు వద్దంటూ బీజేపీ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహిస్తుండటం టీడీపీకి చెందిన కొందరు సీనియర్లను మళ్లీ సందిగ్ధంలో పడేసింది.
తెరపైకి రోజుకో రకమైన ప్రచారం
దేశ, రాష్ట్ర తాజా రాజకీయాలు జిల్లాపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో 2014 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రోజుకో రకమైన ప్రచారం తెరమీదకు వస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, నేతలు రోజుకో రకమైన విశ్లేషణలు చేసుకుంటుండం, ఇతర పార్టీల అగ్రనేతలను కలుస్తుండటం జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సుమారు నెల రోజుల క్రితం జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఆశాభావం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే సదరు ఎమ్మెల్యే అది కేవలం తనపై తప్పుడు ప్రచారం మాత్రమేనని కొట్టి పారేశారు.
ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్ వరంగల్ జిల్లాకు చెందిన కేంద్ర సహాయ మంత్రి ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, ఆ తర్వాత బీజేపీలో చేరాలని ఆయనను కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. అయితే అందుకు రాథోడ్ రమేశ్ మాత్రం తనే పార్టీలో చేరడం లేదని, చేరే ప్రసక్తి కూడా లేదని ప్రకటించారు. తాజాగా ఆదిలాబాద్ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ పక్షాన పోటీ చేసిన పాయల్ శంకర్ బీజేపీలో చేరేందుకు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు తన అనుచరులతో సమీక్ష కూడా నిర్వహించిన ఆయన నిర్మల్‌లో జరిగిన ఓ వివాహ కార్యక్రమం సందర్భంగా బీజేపీ సీనియర్ నేతలతో కూడా మంతనాలు జరిపారు. ఏదేమైనా జిల్లాపై దేశ, రాష్ట్ర రాజకీయాలు ప్రభావం చూపుతుండటం.. టీడీపీతో పొత్తులకు బీజేపీ ససేమిరా అంటుండటం.. ప్రధానంగా టీడీపీ నేతలను మళ్లీ అంతర్మథనంలో పడేసిందని చెప్పక తప్పుదు.
‘దేశం’తో పొత్తు వద్దే వద్దు..
Published Wed, Dec 18 2013 3:58 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement