అయోమయంలో టెన్త్ విద్యార్థులు
కొత్త పాఠాలు.. పాత విధానంలో పరీక్షలు
ఇప్పటికీ పూర్తికాని పాఠ్యప్రణాళిక
మార్చి 26 నుంచి పది పరీక్షలు
యలమంచిలి: విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే పదో తరగతి పరీక్షలు మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంకా65 రోజులు మాత్రమే ఉంది. వీటిలో ఆదివారాలు, సెలవు దినాలు మినహాయిస్తే మిగిలింది రెండు నెలల్లోపే. ఈ వ్యవధిలోనే విద్యార్థులకు పునశ్చరణ తరగతలు నిర్వహించాలి. ప్రభుత్వం పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు గంటల్లో విద్యార్థులను ఉపాధ్యాయులు చదివిస్తున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త పాఠ్య పుస్తకాలు రావడం, ఆ పుస్తకాలు ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం’లో ఉండటం, ఈ పుస్తకాలపై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించకపోవడం, సకాలంలో పాఠ్య ప్రణాళికల బోధన పూర్తికాకపోవడం వంటి అంశాలు పదో తరగతి విద్యార్థుల పరీక్ష ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి.
కానరాని శిక్షణ తరగతులు...
జిల్లా వ్యాప్తంగా పదో తరగతిలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 55వేల మందికి పైగా విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారు 35వేలకు పైగా ఉన్నారు. విద్యార్థుల సిలబస్ నిరంతర మూల్యాంకనంలో ఉంది. అయితే సమస్యల్లా ఇక్కడే ఉంది. మారిన పుస్తకాలకు అనుగుణంగా కాకుండా పాత పద్ధతిలో పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నూతన పాఠ్య విధానంపై ఉపాధ్యాయులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, జూన్ నెలలో ఒక రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తర్వాత విస్మరించారు. గత పరీక్షలు మాదిరిగా కాకుండా నేటి పరీక్ష విద్యార్థి సామర్ధ్యంపై ఆధారపడి ఉంటుంది. అసలే మారిన పాఠ్యాంశాలు, ఆపై పరీక్షల నిర్వహణలో సరికొత్త విధానాలు వెరసి అయోమయంలోనే అగ్ని పరీక్షకు టెన్త్ విద్యార్థులు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పూర్తికాని సిలబస్..?
జిల్లాలో పలు పాఠశాలల్లో పదో తరగతి సిలబస్ ఇప్పటికీ పూర్తి కాలేదు. సాధారణంగా డిసెంబరు నాటికి పూర్తి చేసి జనవరి నుంచి పూర్తి స్థాయిలో పునఃశ్ఛరణ తరగతులు నిర్వహించాల్సి ఉంది. పలు పాఠశాలల్లో 90 శాతం సిలబస్ మాత్రమే పూర్తి చేశారు. గత ఏడాది అక్టోబర్ 12న హుదూద్ తుఫాన్ ప్రభావంతో దాదాపు 10 రోజుల వరకు పాఠశాలల్లో విద్యాబోధన జరగలేదు. జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డును రద్దు చేయడంతో ప్రశ్నపత్రాల తయారీలో అయోమయం నెలకొంది. పాఠశాల, క్లస్టర్ స్థాయిలో తయారు చేసిన ప్రశ్నపత్రాలతోనే త్రైమాసిక, అర్ధసంవత్సర పరీక్షలు నిర్వహించారు. చాలా పాఠశాలల్లో సిలబస్‌ను మొక్కుబడిగా పూర్తయిందనిపించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. సిలబస్ పూర్తి చేయడం, అవగొట్టడం మధ్య చాలా వ్యత్యాసమే ఉందని విద్యానిపుణులు పేర్కొంటున్నారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకశ్రద్ధ ఏదీ..?
గత విద్యా సంవత్సరాల్లో పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. వీరికి నిష్ణాతులైన ఉపాధ్యాయులచే స్టడీ మెటీరియల్‌ను అందించి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడానికి కృషి జరుగుతుండేది. ఉత్తమ గ్రేడులు సాధించడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేవారు. తద్వార పాఠ్యాంశంలోనే విషయాలవారీగా వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకుని వారిపై శ్రద్ధ చూపుతూ బాగా చదివే వారికి తగిన తర్ఫీదునిచ్చేవారు. దీంతో జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉత్తీర్ణత స్థానంలో పురోగతి సాధించింది. ఈ ఏడాది వీటన్నింటికీ గుడ్‌బై చెప్పారని సమాచారం.