సాక్షి ప్రతినిధి, కర్నూలు: గెలవలేక మద్దెల దరువు అన్నచందంగా మారింది జిల్లాలో టీడీపీ నేతల పరిస్థితి. సీమాంధ్రలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా.. కర్నూలు జిల్లాలో మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర కొనసాగింది. జిల్లాలో రెండు ఎంపీ, 11 ఎమ్మెల్యే సీట్లతోపాటు 30 జెడ్పీటీసీలు, 397 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొంది అజేయ శక్తిగా నిలిచింది. అలాగే ఐదు మునిసిపాలిటీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.
జెడ్పీ పీఠాన్ని సైతం కైవసం చేసుకొనే స్థాయిలో జెడ్పీటీసీ స్థానాల్లో జయభేరి మోగించి సత్తా చాటింది. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీన పరచాలని చిల్లర రాజకీయాలకు తెరతీశారు. జిల్లాలో ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారంటూ ప్రచారం చేశారు. అదే విధంగా ఐదుగురు జెడ్పీటీసీ సభ్యులు టీడీపీ అధినేతతో మాట్లాడినట్లు వదంతులు పుట్టించారు. తమకు అనుకూలమైన కొన్ని పత్రికలు, మీడియాల ద్వారా ఈ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జిల్లాలో గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యేలు.. మంత్రి పదవులు దక్కించుకునేందుకే ఈ డ్రామా ఆడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో అందుకు తమను బాధ్యులను చేసే అవకాశం ఉందని.. అందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు సమాచారం. అంతేకాకుండా జెడ్పీ పీఠంపై బోయలను కూర్చోబెట్టం వారికి ఇష్టంలేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఎన్నికలకు ముందే జెడ్పీ చైర్మన్ పదవిని బోయలకు ఇవ్వటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. వైఎస్సార్సీపీ గెలుపొందడంతో ఆ పదవి వారిని వరించినట్లే అయింది. అయితే టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులను చీల్చటానికి కుట్రలు పన్నుతూ ప్రజల్లో చులకనవుతున్నారు.
నీచ రాజకీయాలు..
ఎన్నికల్లో గెలుపొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పదవీచ్యుతులను చేసేందుకు టీడీపీ నేతలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. డబ్బులు, పదవులు, కాంట్రాక్ట్ పనుల ఎరచూపి టీడీపీలోకి చేరాలంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ నేతల్లో లేనిపోని భయాలను పుట్టిస్తున్నారు. ఎలాగైనా జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలనేది టీడీపీ నేతల లక్ష్యం. ఆ తరువాత కొద్దిరోజులకు పార్టీ మారిన నాయకులను పదవులకు, పార్టీకి దూరంగా ఉంచే ఎత్తు వేస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ ఓటమికి బాధ్యులెవరో..?
ఓటమి చెందిన తమ్ముళ్లు ముఖ్య నాయకులపై గుర్రుగా ఉన్నారు. అధికారం దక్కినందుకు ఆనందపడాలో.. ఓటమి చెందినందుకు దిగులుపడాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఓటమికి కారణాలను విశ్లేషించుకున్నారు. కర్నూలు జిల్లాలో ఓటమి చెందిన నాయకులు కొందరు పార్టీలోనే ఉంటూ తనకు పనిచేయని నాయకులపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు.
కర్నూలు, నంద్యాల, మంత్రాలయం, పాణ్యం, నందికొట్కూరు నియోజక వర్గాల్లో ఓటమి చెందిన అభ్యర్థులు, అతనికి వ్యతిరేకంగా పనిచేసిన కేడర్ ఇప్పటికే అధినేతకు ఫిర్యాదులు చేశారు. కోడుమూరులో పొత్తు ధర్మం మరచారంటూ బీజేపీ నేత అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తన ఓటమికి టీడీపీ నేతలే కారణమని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఓటమికి నీవంటే.. నీవే అంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.
పచ్చ కుట్ర
Published Sun, May 25 2014 2:14 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement