ఉద్యమం ఉధృతం | To continue the spirit of party pics | Sakshi
Sakshi News home page

ఉద్యమం ఉధృతం

Published Tue, Dec 10 2013 1:48 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

To continue the spirit of party pics

=పార్టీ అధినేత జగన్ స్ఫూర్తిని కొనసాగించాలి
 =వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల పిలుపు
 =అనకాపల్లి పార్లమెంటు పరిధి సమన్వయకర్తల సమావేశం

 
చోడవరం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి పార్టీ సమన్వయకర్తలు పూర్తిస్థాయిలో కృషి చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకట్రావు పిలుపునిచ్చారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం చోడవరంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర కోసం అలుపులేని పోరాటం చేస్తున్నారని, దీనిని స్ఫూర్తిగా తీసుకొని పార్టీ సమన్వయకర్తలు రానున్న రోజుల్లో పోరాటాన్ని తీవ్రతరం చేయాలన్నారు.

సమైక్య కాంక్ష రాష్ట్రపతికి అవగతమయ్యేలా.. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి పిలుపుమేరకు ఉద్యమాన్ని చేపట్టాలన్నారు. ఈనెల 10వ తేదీన విద్యార్థులు, యువకులతో నియోజకవర్గాల వారీగా ర్యాలీలు, 11న ట్రాక్టర్లతో రైతుల ర్యాలీలు, 12న హైవే, రహదారుల దిగ్బంధం, వంటా వార్పు కార్యక్రమాలు, 14న నియోజకవర్గాల వారీగా ర్యాలీలు, భారీ బహిరంగ సభలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు పీవీఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ విభజనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలను ఏకం చేయడానికి తమ నాయకుడు జగన్‌మోహనరెడ్డి చేస్తున్న కృషి ఇతర పార్టీల నేతలకు ఆదర్శప్రాయమన్నారు.

సమావేశంలో చోడవరం నియోజకవర్గం సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి యువకుడైనా ప్రజా సమస్యల విషయంలో ఎంతో పరిణతితో, అంకితభావంతో వ్యవహరిస్తున్నారన్నారు. సమావేశంలో సమన్వయకర్తలు పూడి మంగపతిరావు, బూడి ముత్యాలనాయుడు, ప్రగడ నాగేశ్వరరావు, పెట్ల ఉమాశంకర్ గణేష్, సీకరి సత్యవాణి, పార్టీ నాయకులు డాక్టర్ బండారు సత్యనారాయణ, నాగులాపల్లి రాంబాబు, నీలం శారద, తమరాన రామకోటి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement