సొమ్ము నాకు సీటు నీకు..! | Transfers to the employees of the Election Commission to conduct elections objectively | Sakshi
Sakshi News home page

సొమ్ము నాకు సీటు నీకు..!

Published Sun, Feb 9 2014 1:54 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

Transfers to the employees of the Election Commission to conduct elections objectively

వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదంటారు. సరిగ్గా ఓ మంత్రిగారు ఇలాగే ఆలోచిస్తున్నట్టున్నారు. వడ్డించేవాడు ‘మనవాడే’ కావాలని.. అప్పుడే అంతా తనకు అనుకూలంగా జరుగుతుందని భావిస్తున్నట్టున్నారు. అందుకే ‘రూల్స్ రామానుజా’ల్లా.. కొరకరాని కొయ్యలుగా మారిన అధికారులను ఎలాగోలా సాగనంపేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అందుకే.. అనుకోకుండా దొరికిన ‘ఎన్నికల బదిలీల’ అస్త్రాన్ని వారిపై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. వారి స్థానాల్లో అనుకున్నవారిని తెచ్చుకొనేందుకు పావులు కదుపుతున్నారు. పనిలో పనిగా ‘లక్ష్మీ కటాక్షం’ కూడా సిద్ధించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని పలువురు చెప్పుకొంటున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా ఊపింది. మూడేళ్లు పదవీ కాలం పూర్తి చేసుకున్నవారు, స్థానికులైన అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలన్నది నిబంధన. కానీ, వీటినితుంగలో తొక్కి తమకు అనుకూలంగా పని చేయనివారిని సాగనంపేందుకు ఒక మంత్రి పావులు కదుపుతున్నారు. ఇందులో లక్షల్లో సొమ్ములు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బదిలీ వేటు పడనున్న ఇద్దరిలో ఒకరు పెద్దాపురం ఆర్డీఓ బి.శంకరవరప్రసాద్ కాగా మరొకరు కాకినాడ ఆర్డీఓ జవహర్‌లాల్ నెహ్రూ.
 
  శంకరవరప్రసాద్ చిత్తూరు జిల్లా నుంచి 2012 అక్టోబర్ 12న బదిలీపై రంపచోడవరం వచ్చారు. అక్కడ కేవలం ఐదు రోజులు మాత్రమే పని చేశాక పెద్దాపురానికి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇక్కడకు వచ్చి ఏడాదిన్నర కూడా కాలేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయనను బదిలీ చేయాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. కానీ గత పంచాయతీ ఎన్నికల్లో ఒక మంత్రి చెప్పిన అభ్యర్థులను స్క్రూటినీలో అనర్హులుగా ప్రకటించకుండా నిజాయితీగా వ్యవహరించడమే ఆయన చేసిన నేరం. దీనిపై కక్ష కట్టిన ఆ మంత్రి ఆయనకు స్థానచలనం కల్పించేందుకు సిద్ధమయ్యారు.
 
  సదరు మంత్రిగారు ఆ సీటు అమ్మకానికి పెట్టినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. కర్నూలులో ఆర్డీఓగా పని చేస్తున్న ఒక అధికారి ఈ సీటు కోసం ఆ మంత్రిగారికి రూ.25 లక్షలు సమర్పించుకున్నారని విశ్వసనీయ సమాచారం. గ్రూపు-1 2009 బ్యాచ్‌కు చెందిన ఆ అధికారి సొంత జిల్లా శ్రీకాకుళం. నర్సీపట్నం ఆర్డీఓగా పనిచేసిన ఆయన ప్రస్తుతం కర్నూలులో ఉన్నారు. పలువురు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నా మంత్రి మాత్రం శివశంకరవరప్రసాద్‌ను బదిలీ చేసేవరకూ విడిచిపెట్టేది లేదంటున్నారని చెబుతున్నారు. గతంలో జిల్లా పరిషత్ సీఈఓగా పని చేసిన కొండయ్యశాస్త్రి బదిలీ విషయంలో కూడా సంబంధిత మంత్రి ఇలాగే వ్యవహరించిన తీరును అధికారులు గుర్తుకు తెస్తున్నారు. జగ్గంపేటలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ వ్యవహారంలో ముక్కుసూటిగా కోర్టు తీర్పును అమలు చేసిన పాపానికి ఆ అధికారిని పట్టుబట్టి మరీ సాగనంపారు. ఆ తరువాత సీఈఓగా కె.జయరాజ్ వచ్చారు. ఆ సందర్భంగా రూ.30 లక్షలు చేతులు మారాయనే వార్తలు వచ్చాయి. ఆయన కొద్దికాలానికే ఏసీబీ దాడిలో సస్పెండవడం గమనార్హం.
 
  పౌరసరఫరాల శాఖలో మరో అధికారికి కాకినాడ ఆర్డీఓ పోస్టింగ్ ఇప్పిస్తానని సదరు మంత్రిగారు రూ.15 లక్షలు దిగమింగినా పని మాత్రం కాలేదు. ఆనక ఆ అధికారి నెత్తీనోరూ మొత్తుకున్నా చిల్లిగవ్వ కూడా ఆయనకు దక్కలేదని సమాచారం. అలాగే ఏరికోరి తెచ్చుకున్న కాకినాడ ఆర్డీఓ జవహర్‌లాల్ నెహ్రూను కూడా సాగనంపేందుకు మంత్రి, పలువురు ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నట్టు తెలియవచ్చింది. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద ఈ ఫైల్ పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్డీఓ జవహర్‌లాల్‌నెహ్రూ కోనసీమలోని ఒక ప్రజాప్రతినిధికి సమీప బంధువు. ఈ బంధుత్వం కారణంగా బదిలీ మంత్రాంగానికి ఆయన అడ్డుపడుతున్నారని సమాచారం.
 
  జవహర్‌లాల్ నెహ్రూకు స్థానచలనం కల్పించి ఆ సీటును కావాల్సిన అధికారికి కట్టబెట్టేందుకు రూ.25 లక్షలకు డీల్ కుదిరిందనట్టు తెలుస్తోంది. జవహర్‌లాల్ నెహ్రూ 2012 సెప్టెంబర్ 27న జిల్లాకు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న ఒక అధికారి ఈ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అమలాపురం రిటైర్‌‌డ ఆర్డీఓకు ఈయన స్వయానా అల్లుడు. మొత్తమ్మీద మంత్రిగారి మంత్రాంగం వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషన్ బదిలీలకు ఇచ్చిన గడువు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈలోగా మంత్రిగారి యత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement