కిడ్నాపర్ల ముఠా వివరాలు తెలియజేస్తున్న పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా
పేదల ఆవాసాలే వారి దందాలకు విలాసాలు.. ఒంటరిగా కనిపించే చిన్నారులే పెట్టుబడి.. అభం శుభం తెలియని చిన్నారులను చాక్లెట్ల ఎర వేసి చెర బట్టి ఎత్తుకుపోతారు.. పిల్లలు లేని వారితో బేరసారాలు చేసి వచ్చిన ధరకు తెగనమ్మేస్తారు. పిల్లలు కనిపించక ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బాధిత తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారే తప్ప.. ముందుకు వెళ్లలేరు. ఇదే పిల్లల బేహారులకు వరంగా మారింది. కేసులు నమోదు కాకపోవడం.. పోలీసుల దృష్టిలో పడకపోవడంతో ఒకదాని తర్వాత ఒకటిగా కిడ్నాప్ దందా కొనసాగిస్తున్నారు. మూడేళ్లుగా సాగుతున్న ఈ దందా.. ఇటీవలే నమోదైన ఓ కేసు పుణ్యాన వెలుగు చూసింది.
సాక్షి, విశాఖపట్నం : నగరంలో చిన్నారుల్ని అపహరించి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్లుగా కిడ్నాప్‌లకు పాల్పడుతున్న నలుగురు గ్యాంగ్‌ని అదుపులోకి తీసుకొని విచారించి.. వివరాలు రాబట్టినట్టు నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిడ్నాప్ ముఠా వివరాలు వెల్లడించారు.
కిడ్నాప్ వ్యవహారంలో ఏ–1 బోండా నాగమణి ఆరిలోవ ప్రాంతంలో 23 సంవత్సరాలుగా నివాసముంటోంది. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు వ్యభిచార వృత్తిని ప్రారంభించింది. ఈ సమయంలో మూడేళ్ల క్రితం తమ్మినేని సుమంత్‌కుమార్(ఏ–3)తో పరిచయం ఏర్పడింది. ఈయనపై పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో ఒక కేసు నమోదైంది. అయితే ఏలూరులో ఉన్న తన చెల్లి సత్యవతికి పిల్లలు లేరని నాగమణితో సుమంత్ చెప్పడంతో అనాథాశ్రమంలో దత్తత తీసుకునేందుకు నాగమణి, సుమంత్ ప్రయత్నించారు. కానీ నిబంధనలు కఠినంగా ఉండడంతో పిల్లల్ని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. నగరమంతా ఆటోలో కలియతిరగగా వుడా పార్కు వద్ద ఓ మహిళతో 8 నెలల ఆడ శిశువు ఉండడాన్ని గమనించారు. 2016 నవంబర్‌లో అర్ధరాత్రి సమయంలో ఆ చిన్నారిని కిడ్నాప్ చేశారు. ఆ పిల్లను ఏలూరులోని సత్యవతి భర్త రాంబాబు(ఏ–8)కు రూ.50 వేలకు విక్రయించారు.
ఫుట్‌పాత్‌పై పిల్లలే టార్గెట్..
2018 నవంబర్‌లో నాగమణి, శేఖర్ కలిసి తగరపువలసలో ఫుట్‌పాత్‌పై ఉన్న ఓ మహిళను ఏమార్చి.. ఆమె రెండేళ్ల బాలుడికి చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి కిడ్నాప్ చేశారు. ఆ చిన్నారి ఫొటోను వాట్సప్‌లో పంపించి బేరం కుదుర్చుకొని నక్కపల్లిలోని చందన రాజేశ్వరరావు(ఏ–7), మడగళ జ్యోతి(ఏ–5) అనే మధ్యవర్తుల సహకారంతో చందన దేవి(ఏ–6)కు రూ.1.20 లక్షలకు విక్రయించారు.
స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో చిన్నారులు..
ముఠా విక్రయించిన శిశువుల్ని తీసుకొచ్చి నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఆధీనంలో ఉంచామని పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. ఫిర్యాదులు ఇవ్వలేని మహిళలకు చెందిన శిశువుల్నే లక్ష్యంగా చేయడం వల్ల మూడేళ్లుగా విక్రయాలు సాగించారని సీపీ వివరించారు. అభిరామ్‌ని విక్రయించేందుకు ఏలూరు తరలిస్తుండగా పోలీసు బృందాలు పట్టుకున్నాయన్నారు. నిందితులపై 420, 468, 471, ఆర్/డబ్ల్యూ34 ఐపీసీ అండ్ సెక్షన్ 80,81 జువైనల్ 363 కిడ్నాప్ కేసులు నమోదు చేశామని వెల్లడించారు. నిందితుల్ని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించినట్టు సీపీ తెలిపారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన సీఐలు పి.రమణయ్య, అవతారం, నిర్మల, ఎస్‌ఐలు సత్యనారాయణ, ఎం.రఘురాం, కె.శ్రీనివాస్‌తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు. విలేకరుల సమావేశంలో డీసీపీ–2 ఉదయ్‌భాస్కర్ బిల్లా, అదనపు డీసీపీ వి.సురేష్‌బాబు, వెస్ట్ ఏసీపీ జి.స్వరూపారాణి, పాల్గొన్నారు.
తొలి ఫిర్యాదుతో గుట్టురట్టు..
పిల్లల్ని కిడ్నాప్ చేసి విక్రయాలకు పాల్పడుతున్నప్పటికీ చిన్నారుల మిస్సింగ్‌కి సంబంధించి ఎక్కడ కేసులు నమోదు కాకపోవడంతో ముఠా మరింత రెచ్చిపోయింది. ప్లాన్ ప్రకారం ఫిర్యాదు చేయలేని వారి పిల్లల్నే ముఠా సభ్యులు టార్గెట్ చేశారు. దీంతో మూడేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా పోలీసులకు ఫిర్యాదులు అందలేదు. అయితే ఏ–2 శేఖర్‌కు పాడేరుకు చెందిన నాగేరి కాంతమ్మ పరిచయమైంది. ఈ నెల 5న తన రెండేళ్ల కుమారుడు అభిరామ్‌తో కలిసి శేఖర్‌ను కలిసేందుకు ద్వారకా బస్‌స్టేషన్‌కు వచ్చింది. శేఖర్‌తో కలిసి ఆటోలో సింహాచలం వెళ్లారు. సింహాచలం కాంప్లెక్స్ వద్ద తన బ్యాగు, కుమారుడిని శేఖర్‌కు అప్పగించి వాష్‌రూమ్‌కి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి బాలుడితో సహా శేఖర్ మాయమవ్వడంతో గోపాలపట్నం పోలీసు స్టేషన్‌లో కాంతమ్మ ఫిర్యాదు చేసింది. ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసుల వలలో ముఠా చిక్కుకుంది.
కన్న కుమార్తెనూ కిడ్నాప్.. విక్రయం..
ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఆరిలోవకు వలస వచ్చిన జెన్నం ఆనంద్(ఏ–2) అలియాస్ శేఖర్‌తో నాగమణికి పరిచయం పెరిగింది. శేఖర్‌కు ఆర్థిక సమస్యలుండడంతో నాగమణి కిడ్నాప్ ప్లాన్ చెప్పింది. శేఖర్ తన సొంత మూడో కుమార్తెను కిడ్నాప్ చేసి మహమ్మద్ జియావుద్దీన్‌కు రూ.లక్షకు విక్రయించారు. వ్యాపారం లాభసాటిగా ఉండడంతో నాగమణి, శేఖర్‌లు కలిసి ఆరిలోవ ఐటీసీ పాయింట్ వద్ద మూడేళ్ల బాలికను చాక్లెట్ ఆశచూపి 2017 ఏప్రిల్‌లో కిడ్నాప్ చేసి మరో నిందితురాలు మడగల లక్ష్మి(ఏ4) ఇంట్లో దాచిపెట్టారు. కిడ్నాప్ చేసిన బాలికను ముద్దుగా రెడీ చేసి ఫొటోలు తీసి తనకున్న పరిచయాల్లో పిల్లలు లేని వారికి వాట్సప్ ద్వారా నాగమణి పంపించింది. అయితే ఆ అమ్మాయిని ఎవరూ కొనకపోవడంతో తమకు బీచ్ రోడ్డులో పాప దొరికిందంటూ నిందితులు ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించేశారు.
Comments
Please login to add a commentAdd a comment