వారి గోడు వినేదెవరు? | Water Levels Down in Vizianagaram | Sakshi
Sakshi News home page

వారి గోడు వినేదెవరు?

Published Mon, Mar 11 2019 7:41 AM | Last Updated on Mon, Mar 11 2019 7:41 AM

Water Levels Down in Vizianagaram - Sakshi

గెడ్డలో వినియోగించే చెలమ నీటిని పరిశీలిస్తున్న అధికారులు

వారంతా మారుమూల గిరిజన గ్రామంలోనివసిస్తున్నారు. ఎన్నికల సమయంలోనే నేతలకు వారు గుర్తుకొస్తారు. మైదాన ప్రాంతానికి రావాలంటే సరైన రహదారి సౌకర్యం ఉండదు. తాగడానికి సురక్షిత నీరు లభ్యం కాదు.అత్యవసర వేళ వైద్యం అందదు. ఇన్ని కష్టాలకోర్చి జీవిస్తున్న వారిని అనుకోకుండా మండల తహసీల్దార్‌ ఆదివారం అక్కడకు వెళ్లారు. దాదాపు పదికిలోమీటర్ల దూరం కొండలు... గుట్టలు ఎక్కి వెళ్లి అక్కడివారి సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు.

శృంగవరపుకోట రూరల్‌ : గిరిజన పల్లెల్లో సౌకర్యాలు లేక అక్కడ నివసిస్తున్నవారి పరిస్థితులు అగమ్యగోచరంగా మారుతున్నాయి. మండలంలోని దారపర్తి గిరిశిఖర పంచాయతీ శివారు రాయపాలెం గిరిజనుల బాధలు చూస్తే ఎంతటివారికైనాగుండె తరుక్కుపోతుంది. ఆదివారం కాలినడకన దారపర్తి పంచాయతీ పల్లపుదుంగాడలో పోలింగ్‌ కేంద్రం పరిశీలనకు వెళ్లిన తహసీల్దార్‌ పి.రామారావు మార్గమధ్యంలో కనిపించిన రాయపాలెం గిరిజనులను పలకరించారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ గెడ్డలో ఏర్పాటు చేసిన వాటర్‌ టబ్బులో నీటి ఊట అడుగంటడంతో కలుషితం లేని మంచినీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన  వ్యక్తం చేశారు. వాటర్‌ టబ్బులో నీటి ఊట అడుగంటడంతో సమీపంలోని గెడ్డలో గల చలమల నీరే దిక్కవుతోందని పేర్కొన్నారు. గ్రామానికి సమీపంలో గల మరో బావిలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ కొద్ది సంవత్సరాల క్రితం ఒక గిరిజన మహిళ అందులో పడి ఆత్మహత్య చేసుకోవటంతో ఆ నీటిని అప్పటి నుంచి తెచ్చుకోవటం మానేశామని గిరిజనులు వివరించారు.

తక్షణమే బావిని పునరుద్ధరిస్తా...
వాడకుండా వదిలేసిన బావి పరిసరాలను గిరిజనులంతా కలిసి శుభ్రం చేసి తనకు తెలియజేస్తే వెంటనే బావి నీటిని జనరేటర్‌ సాయంతో రెండుసార్లు తోడించి బయటకు వదిలేద్దామని, అనంతరం ఊరే నీటిని మోటార్‌ సాయంతో గ్రామ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసే ట్యాంక్‌కు వచ్చేలా పనులు చేయిస్తామని, దీనిపై సంబంధిత గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం ఏఈ, ఇతర అధికారులతో చర్చించి, సమస్యను పరిష్కరిస్తానని తహసీల్దార్‌ పి.రామారావు హామీనిచ్చారు. గిరిజనులతో కలిసి గెడ్డలో అడుగంటిన వాటర్‌ టబ్బు, గిరిజనులు తాగే గెడ్డలో చలమను పరిశీలించారు.

వేసవి వచ్చిందంటేకష్టాలు మొదలైనట్టే
వేసవి సమీపిస్తుంటే మా పంచా యతీ గిరిజనులు పడే మంచి నీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో వృధాగా వదిలేసిన మంచినీటి బావి నీటిని మోటార్ల సాయంతో పైకి తోడించి శుభ్రం చేయిస్తామని అధికారులు చెప్పారు. తరువాత మా గ్రామం వైపు చూడలేదు. ఇప్పటికైనా గిరిజనులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలి.– కాకర అప్పలస్వామి, రాయపాలెం గిరిజనుడు

చలమల నీరే దిక్కు..
దారపర్తి పంచాయతీ పరిధి గిరిజనులకు చలమల నీరే దిక్కవుతోంది. వాటర్‌ టబ్బులను ఏర్పాటు చేసినప్పటికీ పెద్దగా నీటి ఊటలు లేకపోవటంతో మంచినీటి సమస్య తలెత్తుతోంది. గ్రామంలో వాడకుండా వదిలేసిన మంచినీటి బావిని వాడుకలోకి తెస్తామని తహసీల్దార్‌ ఇచ్చిన హామీ నెరవేరితే మాకు మంచినీటి కష్టాలు తప్పుతాయి.– గెమ్మెల అప్పారావు, రాయపాలెం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement