రెగ్యులరైజ్ చేయలేం
- కాంట్రాక్ట్ ఉద్యోగులపై మంత్రివర్గ ఉపసంఘం స్పష్టీకరణ
- క్రమబద్ధీకరణకు ఇబ్బందులున్నాయని వెల్లడి
- ఎన్నికల హామీ అమలు చేయకుండా చేతులెత్తేసిన సర్కారు
- 50 శాతం జీతాల పెంపునకు ఆమోదం.. కేబినెట్‌కు సిఫార్సు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీ కరించేది లేదని అధికారం చేపట్టిన మూడేళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును కమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ నిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయలేమంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయమై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం మంగళ వారం వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో సమావేశమైంది. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్‌ను రెగ్యులరైజ్ చేయడానికి ఇబ్బందులు ఉన్నందున వారికి 50% జీతాలు పెంచాలని ఉపసంఘం నిర్ణయించింది.
ఈ మేరకు కేబినెట్‌కు సిఫార్సు చేస్తూ ఉపసంఘంలోని మంత్రులు యనమల, గంటా, కామినేని, కాల్వ శ్రీనివాసులు నిర్ణయించారు. ఉపసంఘం నిర్ణయాలను మంత్రులు కాల్వ, కామినేని మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో 26,664 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాల పెంపుతో ప్రభుత్వంపై రూ.199.74 కోట్లు భారం పడుతుందని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఆయా శాఖలే తమ బడ్జెట్‌లో కేటాయింపులు చేసుకోవాలన్నారు. భవిష్యత్ లో ఏ శాఖ అయినా ఆర్థిక శాఖ అనుమతితోనే ఉద్యోగుల్ని నియమించుకోవాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెన్యూవల్స్‌ను ఆయా శాఖలే చేసుకుని, వాటిని ఆర్థిక శాఖకు అందించాలని చెప్పారు.