నేడు నంద్యాలలో వైఎస్ జగన్ బహిరంగ సభ
- మధ్యాహ్నం 3 గంటలకు ఎస్‌పీజీ గ్రౌండ్‌లో..
- ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ నేతలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికలో ప్రచారానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు (గురువారం) శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక ఎస్‌పీజీ గ్రౌండులో మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. హైదరాబాద్ నుంచి నేరుగా నంద్యాలకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్‌పీజీ గ్రౌండులో బహిరంగ సభ ఏర్పాట్లను పార్టీ నేతలు బుధవారం పరిశీలించారు.
ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతల భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఐజయ్య, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరులు సభ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ తప్పకుండా విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు.