23 శాతం తగ్గిన అమరరాజా లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జూన్ త్రైమాసికంలో అమరరాజా బ్యాటరీస్ నికరలాభం క్రితం ఏడాదితో పోలిస్తే 23 శాతం తగ్గి రూ.100 కోట్లకు చేరింది. టర్నోవరు 15 శాతం అధికమై రూ.1,685 కోట్లు నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో ఆటోమోటివ్ బ్యాటరీ వ్యాపారం కంపెనీకి కలిసొచ్చింది. ఆటోమోటివ్ ఎగుమతులు, ఇన్వర్టర్ బ్యాటరీ విక్రయాలు పెరగడంతో ప్లాంట్ల వినియోగం అదే స్థాయిలో అధికమైందని తెలిపింది. ఇండస్ట్రియల్ బ్యాటరీలకు మార్కెట్లో డిమాండ్ మందకొడిగా ఉన్నట్టు వివరించింది. బీఎస్‌ఈలో సోమవారం కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 2.10 శాతం పెరిగి రూ.822.55 వద్ద క్లోజయ్యింది.