Amarajas profit
-
అమర్‌రాజా కొత్త ప్లాంటు!
చిత్తూరు, సాక్షి: అమర్‌రాజా బ్యాటరీస్ సంస్థ చిత్తూరులోని తన గ్రోత్ కారిడార్‌లో కొత్త బ్యాటరీ ప్లాంట్‌ను ఆరంభించింది. ద్విచక్ర వాహనాల బ్యాటరీల కోసం ఉద్దేశించిన ఈ ప్లాంట్‌ను సంస్థలోని ప్రధాన వాటాదారు జాన్సన్ కంట్రోల్స్ చైర్మన్ అండ్ సీఈవో జార్జ్ ఆర్. ఓలీవర్ ప్రారంభించారు. దీని వార్షిక సామర్థ్యం 17 మిలియన్ యూనిట్లు. దీని కోసం అమర్‌రాజా గ్రూపు రూ.700 కోట్లు పెట్టుబడి పెడుతోంది. అంతర్జాతీయ పోటీని తట్టుకునేందుకు అమర్‌రాజా మరో ముందడుగు వేసినట్లు ఈ సందర్భంగా గ్రూప్ చైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేని అత్యంత వేగవంతమైన అసెంబ్లీ లైన్స్ ఈ గ్రోత్ కారిడార్‌లోని ప్లాంటులో ఉన్నాయని ఆయన చెప్పారు. తొలి దశలో ఏటా 5 మిలియన్ యూనిట్ల బ్యాటరీల ఉత్పత్తి చేస్తామని గ్రూప్ వైస్‌చైర్మన్ గల్లా జయదేవ్ చెప్పారు. ఈ ప్లాంటు ద్వారా 1300 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందనున్నారన్నారు. విజయవంతమైన భాగస్వామ్యం.. అమర్‌రాజా బ్యాటరీస్తో తమది విజయవంతమైన భాగస్వామ్యమని జార్జ్ ఆర్. ఓలీవర్ చెప్పారు. అమర్‌రాజాతో జట్టు కట్టి దాదాపు 20 సంవత్సరాలు కావస్తోందన్నారు. ‘‘అత్యంత నాణ్యమైన బ్యాటరీలను భారతీయులకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ అత్యాధునిక బ్యాటరీ ప్లాంటు కొత్త మైలురాళ్లను సృష్టిస్తుందనే నమ్మకం మాకుంది’’ అన్నారాయన. కొత్త ప్లాంటు రెండు కంపెనీల మధ్య విప్లవాత్మక ప్రయాణానికి నాంది పలకనుందని చెప్పారు. కార్యక్రమంలో అమర్‌రాజా బ్యాటరీస్ సీఈవో విజయ్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. 2.7 మెగావాట్లతో రూఫ్ టాప్ సోలార్.. ప్లాంటు విద్యుత్ అవసరాల కోసం 2.7 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సోలార్ సిస్టమ్‌లో అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థను ఉపయోగించారు. -
23 శాతం తగ్గిన అమరరాజా లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జూన్ త్రైమాసికంలో అమరరాజా బ్యాటరీస్ నికరలాభం క్రితం ఏడాదితో పోలిస్తే 23 శాతం తగ్గి రూ.100 కోట్లకు చేరింది. టర్నోవరు 15 శాతం అధికమై రూ.1,685 కోట్లు నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో ఆటోమోటివ్ బ్యాటరీ వ్యాపారం కంపెనీకి కలిసొచ్చింది. ఆటోమోటివ్ ఎగుమతులు, ఇన్వర్టర్ బ్యాటరీ విక్రయాలు పెరగడంతో ప్లాంట్ల వినియోగం అదే స్థాయిలో అధికమైందని తెలిపింది. ఇండస్ట్రియల్ బ్యాటరీలకు మార్కెట్లో డిమాండ్ మందకొడిగా ఉన్నట్టు వివరించింది. బీఎస్ఈలో సోమవారం కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 2.10 శాతం పెరిగి రూ.822.55 వద్ద క్లోజయ్యింది.