మరిన్ని సంస్కరణలకు రెడీ...
- ఇన్వెస్టర్లకు భారత్‌లో అపార వ్యాపార అవకాశాలు
- డబ్ల్యూఈఎఫ్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
దావోస్: పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పించేలా ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు ప్రవేశపెట్టిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. రాబోయే రోజుల్లో మరెన్నో సంస్కరణలను ప్రవేశపెట్టబోతున్నామని ఆయన తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు దావోస్ చేరుకున్న సందర్భంగా జైట్లీ ఈ విషయాలు వివరించారు.
ప్రస్తుతం చాలా మటుకు పోటీ దేశాల పరిస్థితి అంత బాగా లేని నేపథ్యంలో గత ఏడు, ఎనిమిది నెలలుగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అలాగే కొనసాగిస్తే మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించవచ్చని ఆయన చెప్పారు. భారత్‌లో వ్యాపారావకాశాల గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ఇదే సరైన అవకాశం అన్నారు.
భారత విద్యుత్ రంగంలోని వివిధ విభాగాల్లో దాదాపు 250 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ిపీయూష్ గోయల్ చెప్పారు. భారత వృద్ధి గాథలో దేశీ, విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున భాగస్వాములు కాగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లతో కూడిన బృందానికి జైట్లీ సారథ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
జనవరి 23 దాకా దావోస్‌లోనే ఉండనున్న జైట్లీ.. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం తదితర అంశాలపై చర్చించేందుకు స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి ఎవ్‌లీన్ విడ్మర్-ష్లంఫ్‌తో కూడా భేటీ అవుతారు. అలాగే భారత్ ప్రధానంగా జరిగే రెండు సెషన్లలోనూ, బ్రిక్స్ కూటమి సభ్యదేశాలతో కలిసి మరో సమావేశంలోనూ జైట్లీ పాల్గొంటారు.
అయిదో అతి పెద్ద బృందం..
డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ నుంచి దాదాపు 120 మంది నమోదు చేసుకున్నారు. ప్రస్తుత సమావేశాల్లో వివిధ దేశాల నుంచి వస్తున్న పెద్ద బృందాల్లో భారత్ అయిదో స్థానంలో ఉంది. భారత్ ప్రాధాన్యాన్ని చాటిచెప్పేలా దావోస్‌లోని కొన్ని బస్సులపైనా ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాలు కనువిందు చేస్తున్నాయి. మొత్తం 791 మంది సభ్యుల బృందంతో అమెరికా అగ్రస్థానంలోను, 283 మందితో బ్రిటన్ రెండో స్థానంలో, 280 మందితో ఆతిథ్య దేశం స్విట్జర్లాండ్ 3వ స్థానంలో, 126 మంది సభ్యుల బృందంతో జర్మనీ నాలుగో స్థానంలో ఉంది.
విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి ..
భారత్‌లో వ్యాపారావకాశాలపై విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారని సదస్సులో పాల్గొంటున్న దేశీ బ్యాంకర్లు పేర్కొన్నారు. ఈ డిమాండును అందిపుచ్చుకునేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్దతిలో గతంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో పలు తప్పిదాలు జరిగాయని... ప్రస్తుత ప్రభుత్వం వీటిని మెరుగ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోందని ఆమె తెలిపారు.
ఇక భారత్‌పై ఇన్వెస్టర్లకు ఇప్పటిదాకా ఉన్న ప్రతికూల సెంటిమెంటు గణనీయంగా మారుతోందని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ చెప్పారు. వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించేందుకు, ఆటంకాలు తొలగించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఇది క్రమంగా పెట్టుబడుల రూపం దాల్చగలదన్నారు. అటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమదైన శైలిలో మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని విజయవంతం చేసే దిశగా పోటీపడుతున్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.
ఆర్థిక వృద్ధికి సంస్కరణలే ఊతం..
ప్రపంచ ఎకానమీ వృద్ధికి వ్యవస్థాగతమైన సంస్కరణలే ఊతం ఇవ్వగలవని డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొంటున్న నిపుణులు, వ్యాపార దిగ్గజాలు అభిప్రాయపడ్డారు. విధానకర్తలు తమను తాము మభ్యపెట్టుకోకుండా విధానపరమైన సంస్కరణలు చేపట్టాలని స్విస్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్ చైర్మన్ యాక్సెల్ ఎ వెబర్ చెప్పారు. ఈ విషయంలో రాజకీయ నాయకులు ఎంత సేపూ ద్రవ్య పరపతి విధానాలను సడలించడంపైనే ఆధారపడకూడదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యుటీ ఎండీ మిన్ ఝు సూచించారు.