మళ్లీ రూ. 28,000పైకి బంగారం
♦ ముంబైలో ఒకేరోజు రూ. 220 అప్
♦ ఢిల్లీలో ఏకంగా రూ. 710 లాభం
♦ కేజీకి రూ. 37 వేలు దాటిన వెండి
ముంబై: స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు, అంతర్జాతీయ ఆర్థిక మందగమన పరిస్థితులు తిరిగి పసిడిని ఇన్వెస్టర్‌కు దగ్గర చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తక్షణం పసిడే పెట్టుబడులకు సురక్షిత మార్గంగా ఇన్వెస్టర్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనితో ఈక్విటీల నుంచి పసిడి వైపు డబ్బు పరుగులు పెడుతోంది.
♦ సోమవారం కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్‌లో పసిడి పరుగు మంగళవారం యథాతథంగా స్పాట్ మార్కెట్‌లో ప్రతిబింబించింది.
♦ ముంబై ప్రధాన మార్కెట్‌లో పసిడి ధర మంగళవారం 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.220 ఎగసి రూ.28,145కు చేరింది. 99.5 గ్రాముల ధర కూడా ఇదే స్థాయిలో ఎగసి రూ.27,995కు చేరింది. వెండి ధర కేజీకి ఏకంగా రూ.785 పెరిగి రూ.37,175కు చేరింది.
♦ ఢిల్లీలో ఈ ధరలు ఏకంగా రూ.710 చొప్పున పెరిగాయి. 99.5, 99.9 స్వచ్ఛత ధరలు వరుసగా రూ.28,435, రూ.28,585కు ఎగశాయి. వెండి ధర కేజీకి ఒకేరోజు రూ.1,180 ఎగసి రూ.37,230కి చేరింది.
♦ పసిడి ధరలు పెరుగుతుండడం వరుసగా ఇది ఎనిమిదవ రోజు. ఎనిమిది రోజుల్లో దాదాపు రూ.900 పెరిగింది. ఏడాది గరిష్ట స్థాయికి ధరలు ఎగశాయి.
ఫ్యూచర్స్‌లో లాభాల స్వీకరణ...
కాగా సోమవారం ఫ్యూచర్స్ మార్కెట్‌లో భారీగా పెరిగిన పసిడి ధర మంగళవారం నెమ్మదించింది. కడపటి సమాచారం అందేసరికి న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో చురుగ్గా ట్రేడవుతున్న మార్చి కాంట్రాక్ట్ ధర ఔన్స్ (31.1 గ్రా) క్రితంతో పోల్చితే 6 డాలర్లు తగ్గి, 1,193 వద్ద ట్రేడవుతోంది. వెండి 15 డాలర్లపైనే ట్రేడవుతోంది.