హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గిన్నిస్‌బుక్ రికార్డు
ఒకేరోజు 709 ప్రదేశాల నుంచి 61,902 మంది రక్తదానం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేటు రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సామాజిక సేవలో భాగంగా చేపట్టిన రక్తదాన కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కింది. దేశవ్యాప్తంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిర్వహించిన రక్తదాన శిబిరంలో 61,902 మంది పాల్గొన్నారని, ప్రపంచంలో ఒకేరోజు ఇంతమంది పాల్గొనడం ఇదే ప్రథమమని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండి ఆదిత్య పూరి పేర్కొన్నారు.
వార్షిక రక్తదాన శిబిరంలో భాగంగా డిసెంబర్ 6, 2013న దేశంలోని 709 చోట్ల 1,115 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి 61,902 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఆయన తెలిపారు. సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఆదిత్య పూరి విలేకరులకు గిన్నిస్ బుక్ రికార్డుల వివరాలను తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగస్తులు, వాలంటీర్లు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొనడంతో ఇది విజయవంతమయ్యిందన్నారు. తొలిసారిగా 2007లో ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు 4,000 యూనిట్ల రక్తాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేకరించింది.