ప్రధాన మార్గాల్లో విమానాలపై లెవీ రూ.5,000
ముంబై: చిన్న పట్టణాలకు విమాన సేవలను అందుబాటులోకి తెచ్చేం దుకు ప్రవేశపెట్టిన ఉడాన్ పథకం కోసం నిధులను రాబట్టుకునేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రధాన మార్గాల్లో విమానయాన సర్వీసులపై రూ.5,000 పన్నును ఖరారు చేసింది. జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఒకే పన్ను అమల్లోకి వస్తుందని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అమల్లో ఉంటుందని పౌర విమానయాన శాఖ డైరక్టరేట్ జనరల్ తన ఆదేశాల్లో పేర్కొంది.
ఉడాన్ పథకం కోసం నిధులు రాబట్టేందుకు పౌర విమానయాన శాఖ ముంబై, ఢిల్లీ సహా ప్రధాన విమానాశ్రయాల నుంచి నడిచే విమాన సర్వీసులపై లెవీ కింద రూ.8,500 వరకు ప్రస్తుతం వసూలు చేస్తోంది. కాగా, పాత చార్జీల మేరకు ఇప్పటికే చెల్లించేసి ఉంటే సవరించిన రేట్ల మేరకు వాటిని సర్దుబాటు చేస్తామని ఆ శాఖ స్పష్టం చేసింది.