మార్కెట్ మళ్లీ జంప్
- ఈసారి చైనా జోష్
- సెన్సెక్స్ 424 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు అప్
- కోలుకున్న రూపాయి
కొన్నాళ్లుగా కలవరపెడుతున్న చైనా నుంచి కాస్త సానుకూల పరిణామాలు రావడంతో మంగళవారం దేశీ మార్కెట్లు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 424 పాయింట్లు ఎగిసి కీలకమైన 25,000 పాయింట్ల స్థాయిని అధిగమించింది. నిఫ్టీ సైతం 129 పాయింట్లు పెరిగింది. ఎకానమీని మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పారిశ్రామిక దిగ్గజాలు, బ్యంకర్లు, ఆర్థికవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కావడం కూడా మార్కెట్లకు ఊతమిచ్చినట్లు జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండమెంటల్ రీసెర్చ్ విభాగం హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు.
రూపాయి కూడా 27 పైసల మేర బలపడి రెండేళ్ల కనిష్టం నుంచి 66.54 స్థాయికి కోలుకుంది. సెన్సెక్స్ ఒక దశలో ఇంట్రా డే గరిష్ట స్థాయి 25,411 పాయింట్లను కూడా తాకి.. చివరికి 25,318 వద్ద ముగిసింది. చైనా, వర్షాభావ భయాలతో గడిచిన రెండు సెషన్లలో సెన్సెక్స్ ఏకంగా 871 పాయింట్లు క్షీణించింది. మరోవైపు నిఫ్టీ సైతం కొంత సేపు 7,700 మార్కుపై కదలాడి చివరికి 129 పాయింట్ల లాభంతో 7,688 వద్ద ముగిసింది.
వెలుగులో ఫైనాన్షియల్ స్టాక్స్..
బేస్ రేట్ ఆధారిత వడ్డీ రేట్లకు సంబంధించిన ప్రతిపాదిత నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ కొంత సడలించే అవకాశాలున్నాయన్న వార్తలతో ఫైనాన్షియల్ స్టాక్స్ ప్రధాన ఆకర్షణగా నిల్చాయి. 30 షేర్ల సెన్సెక్స్‌లో 26 స్టాక్స్ లాభపడ్డాయి. బీఎస్‌ఈలో 1,459 స్టాక్స్ లాభాల్లో.. 1,190 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవరు రూ. 2,042 కోట్ల నుంచి రూ. 2,666 కోట్లకు పెరిగింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నికరంగా రూ. 660 కోట్ల విలువ చేసే స్టాక్స్ విక్రయించగా.. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 447 కోట్ల మేర కొనుగోళ్లు చేశారు.
మరోవైపు, ఎన్‌ఎస్‌ఈ స్టాక్స్‌లో రూ. 16,034 కోట్లు, డెరివేటివ్స్‌లో రూ. 2,19,091 కోట్లు టర్నోవరు నమోదైంది. షార్ట్ కవరింగ్, తక్కువ స్థాయుల్లో కొనుగోళ్ల కారణంగా బ్లూ చిప్ షేర్లు మొదలైనవి పెరిగాయని వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. అయితే, వచ్చే వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం ప్రకటించిన తర్వాతే మార్కెట్లు స్థిరపడే అవకాశం ఉందని వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.
చైనా ఊతం..
చైనా ప్రభుత్వం కొత్తగా ఆదాయ పన్ను కోతలు, స్వల్పకాలిక స్పెక్యులేషన్‌ను నివారించేందుకు.. షేర్ల పతనాన్ని నిరోధించేందుకు సర్క్యూట్ బ్రేకర్లను ప్రతిపాదించడం అక్కడి మార్కెట్స్‌కు ఉత్సాహాన్నిచ్చింది. చైనా షాంఘై కాంపోజిట్ సూచీ 2.92 శాతం మేర, హాంకాంగ్‌కి చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 3.28 శాతం పెరగ్గా.. జపాన్ సూచీ నికాయ్ మాత్రం 2.43 శాతం క్షీణించింది. మరోవైపు, జర్మనీ ఎగుమతులు దిగుమతుల సానూకూల గణాంకాలతో యూరోపియన్ సూచీలు పెరిగాయి. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ మొదలైన దేశాల సూచీలు 2.04 శాతం దాకా లాభపడ్డాయి.