జియోకు జోష్: త్వరలోనే ఆ ఛార్జీలు రద్దు
జియోకు జోష్: త్వరలోనే ఆ ఛార్జీలు రద్దు
Published Wed, Aug 23 2017 11:58 AM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM
సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్ జియోకు టెలికాం రెగ్యులేటరీ గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. వివాదస్పదమైన 14 పైసల ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీలను దశలవారీగా పూర్తిగా రద్దు చేయాలనే ప్రతిపాదనను ట్రాయ్ పరిగణలోకి తీసుకుంటుంది. తొలుత 50 శాతం అంటే 7 పైసలు కోత పెట్టనున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. అనంతరం 3 పైసలు, ఆ తర్వాత జీరోకు ఈ ఛార్జీలు తీసుకురావాలని ట్రాయ్ నిర్ణయించినట్టు పేర్కొన్నాయి. ఈ నెల చివర్లోనే ఐయూసీ ఛార్జీలపై రెగ్యులేటరీ నుంచి తుది నిర్ణయం రానుంది. అయితే ఐయూసీ రద్దు చేసినా లేదా తగ్గించినా టెలికాం సంస్థల ఆదాయం తగ్గిపోతుందని భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు పేర్కొంటున్నాయి. వీటిని రద్దు చేయదంటూ కోరుతున్నాయి. జియో మాత్రం ఐయూసీ ఛార్జీలను రద్దు చేయాలని పట్టుబడుతోంది. ఐయూసీ ద్వారా ఆపరేటర్లు తమకు సమస్యలు సృష్టిస్తున్నారని జియో ఆరోపిస్తోంది.
ఐయూసీ రద్దుతో జియో తన సేవింగ్స్‌ను పెంచుకుంటుందని, దీంతో మరింత ధరల యుద్దానికి తెరలేపుతుందని ఇతర ఆపరేటర్లు ఆందోళనకు గురవుతున్నాయి. ప్రస్తుతం జియోకు 100 మిలియన్ సబ్‌స్క్రైబర్లున్నారు. ఐయూసీ రద్దు చేస్తే, ఈ కంపెనీ ఏడాదిలో రూ.6720 కోట్ల ఆదాయం పొందుతోంది. ఇదే సమయంలో ఇతర ఆపరేటర్లు రూ.6720 కోట్లను వదులుకోవాల్సి వస్తోంది. ఐయూసీని 3 పైసలుగా చేస్తే, ఇంక్యుబెంట్స్‌కు ఏడాదిలో రూ.5,280 కోట్ల నష్టమొస్తుంది. ఒకవేళ 7 పైసలకు తగ్గించినా రూ.3,360 కోట్లను వదులుకోవాల్సిందే. ఒక టెలికాం నెట్‌వర్క్ నుంచి మరో టెలికాం నెట్‌వర్క్‌కు కాల్ వెళ్లినపుడు, కాల్ అందుకున్న నెట్‌వర్క్‌కు చెల్లించే మొత్తాన్నే ఐయూసీ ఛార్జీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఇది నిమిషానికి 14 పైసలుంది. ఐయూసీల ద్వారా భారతీ ఎయిర్‌టెల్, ఐడియాలకు 14 శాతం, 18 శాతం దేశీయ వైర్‌లెస్ ఆదాయం సమకూరుతుంది. ఐయూసీలను రద్దుచేస్తే, మొబైల్ ఫోన్ బిల్లులు తగ్గనున్నాయి.
Advertisement