ఉబర్‌కు ఏడాదికి ఏడువేల కోట్ల నష్టం!
యాప్ ఆధారిత క్యాబ్ సేవల సంస్థ ఉబర్‌కు చైనాలో ఊహించనిరీతిలో నష్టాలొస్తున్నాయి. ఏడాదికి ఆ దేశంలో ఒక బిలియన్ డాలర్ల (రూ. 6,872 కోట్ల)కుపైగా నష్టపోతున్నది. చైనాలో ఉన్న విపరీతమైన పోటీయే ఇందుకు కారణమని ఉబర్ సీఈవో ట్రావిస్ కలానిక్ తెలిపారు. దీంతో చైనాలో ఈ మేరకు భారీ నష్టమొస్తున్నదని ఆయన ప్రైవేటు కార్యక్రమంలో చెప్పారు. ఉబర్ చైనా కూడా తమకు దేశంలో బిలియన్ డాలర్లకుపైగా నష్టం వస్తున్నదని అంగీకరించింది.
అమెరికాకు చెందిన ఉబర్ 2014లో చైనాలో తన సేవలను ప్రారంభించింది. దీనికి చైనాకు చెందిన అతిపెద్ద యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీసు దిది కువైదీ నుంచి గట్టిపోటీ ఎదురవుతున్నది. చైనాలోని 40 నగరాల్లో ఉబర్ ప్రస్తుతం క్యాబ్ సేవలను అందిస్తున్నది. రానున్న 12 ఏళ్లలో మొత్తం చైనాలోని వంద నగరాలకు తమ సేవలు విస్తరిస్తామని ఉబర్ గత ఏడాది ప్రకటించింది. తమకు అమెరికాలో భారీగా లాభాలు వస్తున్నప్పటికీ, చైనాలో నష్టాలు వస్తున్నాయని, అయినప్పటికీ చైనానే తమకు అతిపెద్ద మార్కెట్‌గా భావిస్తున్నామని ఉబర్ తెలిపింది.