ఏమైందమ్మా.. | College Student Commits Suicide In Vizianagaram District | Sakshi
Sakshi News home page

ఏమైందమ్మా..

Published Fri, Nov 29 2019 11:08 AM | Last Updated on Fri, Nov 29 2019 11:08 AM

College Student Commits Suicide In Vizianagaram District - Sakshi

ఈ వసతి భవనంపై నుంచే దూకి అఖిల ఆత్మహత్యాయత్నం చేసింది (ఇన్‌సెట్‌లో) శాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నప్పటి చిత్రం

అసలే ఆడపిల్ల. అమాయకత్వం... బిడియం... సున్నితత్వం... సహజం. ఆమె మనసును ఏ విషయం గాయపరిచిందో... ఎందుకు అవమానంగా భావించిందో... కానీ ప్రాణాలకు తెగించింది. ఏకంగా మూడో అంతస్తునుంచి దూకేసింది. కాళ్లు చేతులు విరిగి ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. కళాశాల యాజమాన్య తీరుపై ఆగ్రహంతో ఆమె బంధువులు గురువారం ఆందోళన చేపట్టడంతో ఆసలు విషయం వెలుగు చూసింది. ఈ సంఘటనను ఎందుకు గుట్టుగా ఉంచాల్సి వచ్చిందో... విచారణ చేపడితేనే వెలుగు చూసేది.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: చదువుకోవాలన్న ఆశ... ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న లక్ష్యం... కుటుంబానికి బాసటగా నిలవాలన్న కోరిక.. ఆమెను కన్నవారికి దూరంగా ఉన్నా చదువుకోవాలన్న ఆకాంక్షను పెంచాయి. ఆ సమయంలో ఆమెకు అండగా నిలబడాల్సింది... సరైన దారిలో నడిపించాల్సింది ఉపాధ్యాయులే. తెలిసీ తెలియని వయసులో పిల్లలు ఏదైనా పొరపాటు చేసినా సున్నితంగా మందలించి, వారికి నచ్చజెప్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సింది కూడా వారే. కానీ ర్యాంకుల కోసం, ఫీజుల కోసం మాత్రమే ఆలోచించే కొన్ని విద్యాసంస్థల నిర్వాహకులు, వాటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఫలితంగా విద్యార్థుల ఆత్మహత్యలు నిత్యకృత్యమైపోయాయి. కారణమేతైనా కావచ్చు గానీ ఓ అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించడం... ఆమె ఆస్పత్రిలో కన్నుమూయడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.

అసలేం జరిగిందంటే... 
సాలూరు మండలం నెలిపర్తి పంచాయతీ ఎన్‌ఆర్‌ఆర్‌ అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో మొదటి సంవత్సరం అగ్రికల్చరల్‌ డిప్లొమా చదువుతు బోనంగి అఖిల కళాశాల  మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ నెల 25న జరిగిన ఈ సంఘటనను బయటకు రానివ్వకుండా కళాశాల యాజమాన్యం చాలా జాగ్రత్త పడింది. వార్డెన్‌ వేధింపుల కారణంగా ఆమె ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతుండగా దొంగతనం చేసి దొరికిపోయినందువల్ల అవమానంగా భావించి  ఇలాంటి పని చేసుంటుందని కళాశాల నిర్వాహకులు చెబుతున్నారు. అయితే విషయం బయటకు చెప్పొద్దని జరిగిన సంఘటనను దాచి ఉంచితే అదనపు మార్కులు వేస్తామని కళాశాల నిర్వాహకులు బాధితురాలిని మభ్యపెట్టడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితురాలి చిన్నాన్న రామకృష్ణ గురువారం సాలూరు వచ్చి కళాశాల ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

బంధువులు ఏమంటున్నారంటే... 
తెర్లాం మండలం ఎన్‌.బూర్జివలసకు చెందిన బోనంగి శంకర్రావు కుమార్తె బోనంగి అఖిల సాలూరు మండలంలోని నెలిపర్తి ఎన్‌ఆర్‌ఆర్‌ అగ్రికల్చరల్‌ పాలిటెక్నిక్‌ ప్రైవేట్‌ కళాశాలలో వసతి గృహాంలో ఉంటూ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 21వ తేదీన తోటి విద్యార్థినికి చెందిన పుస్తకం. దుస్తులను ఆమెకు తెలియకుండా అఖిల తీసుకుందని, ఆ విషయాన్ని గమనించి దండించామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కానీ ఆ తరువాత మరో విద్యార్ధినికి చెందిన వెయ్యి రూపాయలు కనిపించకపోవడంతో వాటిని కూడా అఖిల తీసేసిందన్న ముద్రవేశారు. ఎవరి వస్తువులు పోయినా ఆమెనే అనుమానించడం మొదలుపెట్టారు. ఈ సంఘనలతో ఆమె తీవ్రంగా కలతచెందింది.

ఈ నెల 25వ తేదీ సాయంత్రం వసతి గృహం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుందని బాలిక తండ్రి, బంధువులు అంటున్నారు. అంతేకాదు ఎవరడిగినా కాలు జారి పడి నట్లు చెప్పాలని లేదంటే పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తామని, అబద్ధం చెబితే ప్రాక్టికల్స్‌లో అదనపు మార్కులు కలుపుతామని కళాశాల యాజమాన్యం ఆమెకు ఎరవేశారని వారు ఆరోపించారు. అదే రోజు రాత్రి 8 గంటలకు తమకు సమాచారం ఇచ్చారని, విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో తీసుకొచ్చి విడిచిపెట్టి వెళ్లిపోయారని తాము అక్కడినుంచి విశాఖ కేజీహెచ్‌కు తీసుకు వెళ్ళామని ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ప్రాణాలు వదిలిందని కన్నీరు మున్నీరయ్యారు. అఖిల తండ్రి శంకర్రావు, బాబాయ్‌ రామకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు కళాశా>ల వద్ద గురువారం ఆందోళనకు దిగారు. అఖిల ఆత్యహత్యాయత్నానికి కారణమైన వార్డెన్‌ను శిక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. 

నాపై ఆరోపణలు సరికాదు 
అఖిల దొంగ అని మేం ఎప్పుడూ ఆరోపణలు చేయలేదు. తోటి విద్యార్ధిని వస్తువులను ఆమె అనుమతిలేకుండా తీయడం తప్పు, మరెప్పుడు అలా చేయవద్దని చెప్పాను. అంతకు మించి మరే విధంగానూ అఖిలను వేధించలేదు. నాపై ఆరోపణలు చేయటం సరికాదు. 
– ఆమని, వార్డెన్‌

అపరాధ రుసుం చెల్లించాలని భయపెట్టాం.. 
అభిల తన పుస్తకం, బట్టలు దొంగలించిందని ఓ విద్యార్థిని, వార్డెన్‌ ఆమని నా వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు. అఖిలను అడిగితే తానే వాటిని తీసినట్లు ఒప్పుకుంది. ఇంకెప్పుడూ అనుమతి లేకుండా ఇతరుల వస్తువులు తీయకూడదని మందలించాం. అపరాధ రుసుం చెలించాలని భయపెట్టాం. ఆ మాత్రానికే బిల్డింగ్‌పై నుంచి దూకేస్తుందా... వార్డెన్‌ వేధింపులనేది అవాస్తవం. అఖిల ఆత్మహత్యాయత్నానికి వేరే కారణాలు ఉండవచ్చు. 
– ఎం,నరేంద్రబాబు, కళాశాల ప్రిన్సిపాల్‌.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement