సాక్షి, శ్రీకాకుళం: పుట్టిన రోజునాడు బైక్ రేస్‌లో పాల్గొనాలన్న యువకుల సరదా.. వారి ప్రాణాలు తీయడంతో పాటు ఎదురుగా వస్తున్న మరో వ్యక్తిని పొట్టనపెట్టుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాలు.. శ్రీకాకుళం నగరంలో కస్పావీధికి చెందిన దువ్వు హిమశేఖర్ (19) పుట్టినరోజు సందర్భంగా బుధవారం రాత్రి స్నేహితులంతా కలిసి పార్టీ చేసుకున్నారు. గురువారం వేకువజామున కళింగపట్నం బీచ్‌కు వెళ్తామంటూ స్నేహితులంతా బయల్దేరారు. హిమశేఖర్ బైక్‌పై అతని మిత్రుడు బెహరా తేజేశ్వరరావు (19) ఉన్నాడు. మార్కెట్‌లో సరుకులు కొనేందుకు గార మండలం తూలుగు గ్రామానికి చెందిన వ్యాపారి దామోదర శ్రీనివాసరావు (35), కలాసీ లింగబరి బోడయ్య ద్విచక్రవాహనంపై ఎదురుగా వస్తున్నారు. చల్లపేట జంక్షన్ వద్ద రెండు వాహనాలు ఢీకొనడంతో దామోదర్ శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొనఊపిరితో ఉన్న హిమశేఖర్, తేజేశ్వరరావు, బోడయ్యలను హిమశేఖర్ స్నేహితులు రిమ్స్‌కు తరలించారు. మార్గమధ్యంలోనే హిమశేఖర్ మృతి చెందాడు. పరిస్థితి విషమంగా ఉన్న తేజేశ్వరరావును కుటుంబ సభ్యులు జెమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు.
పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. హిమశేఖర్, అతడి స్నేహితులు రాత్రి వేళల్లో పెట్రోలు దొంగతనం చేసి జల్సా చేయడానికి అలవాటు పడ్డారని పోలీసులు గుర్తించారు. వాంబే కాలనీలో ఓ ఇంటి నుంచి దొంగిలించిన కోడిని ఎవరికి దక్కాలనే దానిపై వీరంతా పందెం పెట్టుకున్నారు. ముందుగా కళింగపట్నం బీచ్‌కు చేరుకున్న వారికే కోడి దక్కేలా బైక్ రేసు పెట్టుకున్నారు. అతివేగంగా వెళుతూ చల్లపేట జంక్షన్ వద్ద ప్రమాదం బారిన పడ్డారు. బైక్ రేస్‌లో పాల్గొన్న హిమశేఖర్, తేజేశ్వరరావుతో పాటు వ్యాపారి శ్రీనివాసరావు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. విచారణలో భాగంగా 13 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment