ఖైదీల క్షమాభిక్షలో జాప్యం
రాజమహేంద్రవరం: జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 30 అమలులో జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీఓ మార్గదర్శకాల ప్రకారం కోస్తా రీజియన్‌లో క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల జాబితాను జైలు అధికారులు సిద్ధం చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 107 మంది, మహిళా జైలులో 14 మంది, విశాఖ సెంట్రల్ జైలు నుంచి 54 మంది ఖైదీల విడుదలకు సన్నాహాలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈనెల 26న జెండా వందనానికి ముందే ఖైదీలను విడుదల చేయాలని ఆదేశించింది. అయితే ఖైదీలు ఒకరికంటే ఎక్కువ మందిని హత్య చేసిన కేసుల్లో, చిన్నపిల్లలపై లైంగికదాడి జరిపి, హత్య చేసిన కేసుల్లో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడంపై గవర్నర్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో 26న ఖైదీల విడుదలలో జాప్యం జరిగే అవకాశముంది. రాష్ట్ర కేబినెట్ మరోసారి సమావేశమై క్షమాభిక్షకు సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు రూపొందించి, ఆమోదిస్తేనే ఖైదీల విడుదలకు మార్గం సుగమమవుతుంది.
కాగా క్షమాభిక్ష ప్రసాదిస్తే వృద్ధాప్యంలోనైనా తమ కుటుంబ సభ్యులతో గడపాలని ఆశపడుతున్న ఎందరో జీవిత ఖైదీలు క్షమాభిక్షలో జాప్యం జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో దిగులు పడుతున్నారు. చేతికి అందిన తాయిలం నోటికి అందకుండా పోయినట్టు కాక.. రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాల్ని పరిష్కరించి, క్షమాభిక్ష జీఓను అమలు చేయాలని కోరుతున్నారు.