కలెక్టరేట్ వద్ద ధర్నాల హోరు
కలెక్టరేట్ వద్ద ధర్నాల హోరు
Published Mon, Sep 19 2016 9:47 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
కాకినాడ సిటీ :
సమస్యలపై వివిధ సంఘాలు చేపట్టిన ఆందోళనలతో సోమవారం కలెక్టరేట్ హోరెత్తింది. కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదుట ధర్నా అనంతరం ఆయా సంఘాల నాయకులు అధికారులకు తమ డిమాండ్లను వివరిస్తూ వినతిపత్రాలు అందజేశారు. తొండంగి మండలంలో దివీస్ ఫార్మా కంపెనీ నిర్మాణ పనులు తక్షణం నిలిపివేయాలని కోరుతూ దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆ ప్రాంత ప్రజలు ధర్నా నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కంపెనీ వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డునపడే పరిస్థితి ఉందని, భూములు కోల్పోవడంతో తమ జీవితాలు అగమ్యగోచరంగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సెక్షన్ 144ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు మద్ధతు తెలిపిన సీపీఎం నాయకులు మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయ్యాక ప్రభుత్వ అనుమతి, పర్యావరణశాఖ అనుమతి కూడా రాలేదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు జి.బేబిరాణి, బాధిత ప్రజలు పాల్గొన్నారు.
కళాశాల విద్యార్థుల సమస్యలపై..
కాకినాడ పీఆర్ ఆర్ట్స్ జూనియర్ కళాశాల, ఒకేషనల్ కలాశాలల్లో సమస్యలపై ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆందోళన నిర్వహించింది. ఆర్ట్స్ కళాశాలకు రూ.5 కోట్లు, ఒకేషనల్ కళాశాలకు రూ.3 కోట్లు కేటాయించి అభివృద్ధి చేయాలని, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, 2015–16 సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థుల ఉపకార వేతన బకాయిలు విడుదల చేయాలని, లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బి.సిద్ధు, నాయకులు శివాజీ, వంశీ, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలి
కాకినాడ పర్లోవపేట శివారు మహాత్మాజ్యోతిరావుఫూలే కాలనీలోని అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ భారత కార్మిక సంఘాల సమాఖ్య ధర్నా నిర్వహించింది. బాధితులకు నేటికీ సహాయం అందలేదదని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు అన్నారు. బాధితులందరికీ పట్టాలు పంపిణీ చేసి పక్కాగృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ నాయకులు వి.రామన్న, రాజబాబుతో పాటు బాధిత కుటుంబాలు పాల్గొన్నాయి.
ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉద్యోగుల ధర్నా
వివిధ డిమాండ్లతో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. హెచ్‌ఐవీ నిరోధించానికి ప్రచారం చేస్తున్న తమ పరిస్థితి దయనీయంగా ఉందని ఎయిడ్స్ నియంత్రణ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు పేర్కొన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా ఒకటవ తేదీన వేతనాలు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్‌కుమార్, కార్యదర్శి రాంబాబు, నాయకులు ఎ.గిరిబాబు, డి.నాగమణి పాల్గొన్నారు.
నిర్బంధ కాండను మానుకోవాలి
ప్రజాస్వామ్యవాదులపై కేంద్రం అవలంబిస్తున్న నిర్బంధకాండను మానుకోవాలని ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఉన్నత విద్యాలయాలపైన, జర్నలిస్ట్‌లు, విద్యార్థులు, లౌకికవాదులపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ వంటి హిందుత్వ మూకలు దాడులు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అసోసియేషన్ నాయకులు జె.నాగేశ్వరరావు, పి.శ్రీనివాస్, జె.అచ్చిరాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement