►చిత్తూరు కార్పొరేషన్‌లో గాడితప్పిన పాలన
►నేతలకు సాగిలపడుతున్న యంత్రాంగం
►కలెక్టర్ జోక్యం చేసుకుంటేనే న్యాయం
రోడ్డు విస్తరణ పేరిట చిత్తూరు నగరానికి ఐకాన్‌గా ఉన్న గాంధీ విగ్రహాన్ని తొలగించి, స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ తన శ్రీనివాస ట్రస్టు నుంచి వన్‌టౌన్ వద్ద కొత్తగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీని చుట్టూ ఉక్కుతో గ్రిల్స్, చిన్న ప్యాచ్ రోడ్డు వేయాలని ఎమ్మెల్యే అధికారులకు లేఖ రాశారు. ఎలాంటి టెండర్లు పిలవలేదు. డిపార్టుమెంటు వర్కు కాదు. నామినేషన్ పద్ధతిలో ఉక్కు గ్రిల్స్‌కు రూ.2 లక్షలు, మెటల్ రోడ్డుకు రూ.5 లక్షలు వెచ్చించి ఆగమేఘాలపై అధికారులు పనులు చేయిస్తున్నారు. అధికారులు ఒక్క మాట చెబితే రూ.25 లక్షలకు పైగా విగ్రహం కోసం ఖర్చు చేసిన ఎమ్మెల్యే ఈ చిన్న మొత్తాన్ని కూడా తన ట్రస్టు నుంచే భరించేవారు. ఇలా ప్రజాధనం దుర్వినియోగం అయ్యేది కాదు.
చిత్తూరు (అర్బన్): అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పే పనులకు తక్షణం ప్రాధాన్యత ఇచ్చే అధికారులు.. ప్రజలకు అత్యవసరంగా మారిన అంశాలను ఏళ్ల తరబ డి విస్మరించడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో కొందరు అధికారులు తాము ప్రభుత్వ ఉద్యోగులమనే విషయం మరచి.. టీడీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పట్టుతప్పిన పాలన..
టీడీపీలోని గ్రూపులు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కొందరు అధికారులకు బాగానే కలసి వస్తోంది. కొందరు మేయర్ వైపు, మరికొందరు ఎమ్మెల్యే వైపు మొగ్గుచూపుతున్నారు. తాజాగా ఇంకో అడుగు ముందుకేసి ఎమ్మెల్సీగా ఎన్నికైన దొరబాబు చెంతకు కూడా కొందరు చేరారు. అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడి మాటలు అక్కడ మోసేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. దీంతో కార్పొరేషన్ కార్యాలయంలో పాలన పూర్తిగా పట్టు తప్పింది. అధికారులు ఎవరికివారు నేతల వద్ద స్వామి భక్తి చాటుకోవడానికి చెప్పీ చెప్పకనే పనులు చేయడం.. రూ.కోట్ల విలువైన టెండర్లు రద్దు చేయడం ఇందులో భాగమే.
ఫలితంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు లేక కొన్ని ప్రాంతాలు, నీటి పైపులైన్లు, రోడ్లు లేక మరికొన్ని ప్రాంతాల ప్రజలు అవస్థల జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాధనాన్ని అవసరంలేని చోట్ల ఖర్చు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సంస్థలు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చిత్తూరు కార్పొరేషన్‌పై కలెక్టర్ దృష్టి పెడితే తప్ప.. పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం కనిపించడం లేదు.