కడుపులో బిడ్డ
కాసుల కోసం కోతలు
Published Fri, Aug 19 2016 1:11 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
– ప్రయివేటు ఆస్పత్రుల్లో అడ్డదిడ్డంగా సిజేరియన్లు
– గర్భిణుల అవగాహనలేమే వారికి అవకాశం
– మానసిక రుగ్మతలు తప్పవంటున్న వైద్యనిపుణలు
సాక్షి, చిత్తూరు :
కార్పొరేట్ ఆస్పత్రుల ధన దాహానికి హద్దుండడం లేదు. కాసుల కోసం కక్కుర్తి పడుతున్నాయి. గర్భిణులకు అవసరం లేకున్నా సిజేరియన్లు చేస్తూ తల్లీబిడ్డలతో చెలగాటమాడుతున్నారు. అవగాహన లేమిని అవకాశంగా తీసుకుని అడ్డదిడ్డంగా కోతలు పెడుతున్నారు. ప్రభుత్వమూ ఉదాసీనంగా వ్యవహరించడంతో వారి ఆగడాలకు అంతంలేకుండా పోతోంది.
పిల్లలు పుట్టే సమయంలో అవసరం లేకున్నా.. సిజేరియన్లు చేస్తుండడంతో మహిళలు అనారోగ్యం పాలవుతున్నారు. జిల్లాలో సుమారు 50 శాతానికి పైగా సిజేరియన్ ఆపరేషన్ ద్వారానే ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ శస్త్ర చికిత్సలన్నింటికీ దాదాపు ప్రై వేటు ఆసుపత్రులే వేదికలవుతున్నాయి. వాస్తవానికి అత్యవసర సమయాల్లో మాత్రమే శస్త్ర చికిత్స నిర్వహించి పురుడు పోయాల్సి ఉంటుంది. గర్భిణులని ఒక రోజు పాటు పరిశీలనలో ఉంచి ఆ తర్వాత అవసరం అనుకుంటే సిజేరియన్ చేయాలని నిబంధనలు ఉన్నా ప్రయివేటు ఆస్పత్రులు వాటిని ఖాతరు చే యడం లేదు. సాధారణంగా గర్భం దాల్చినప్పటి నుంచి నార్మల్ డెలివరీనా.. సిజేరియనా అనే ఆందోళన గర్భిణులలో కన్పిస్తోంది. దీన్నే ప్రై వేటు ఆసుపత్రులు తమ వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నాయి.
తప్పదు చేయించుకోవాల్సిందే
‘కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. సిజేరియన్ చేయకపోతే తల్లి,బిడ్డ ప్రాణాలకే ముప్పు’ అంటూ మరీ హెచ్చరించి ప్రై వేటు ఆసుపత్రులు ఆపరేషన్లు చేస్తున్నాయి. వీటిపై అంతగా అవగాహనలేని గర్భిణులు భయంతో చేసేదేమిలేక సిజేరియన్ల వైపై మొగ్గుచూపుతున్నారు. ప్రై వేటు ఆసుపత్రుల్లోనే నెలలో కనీసం 2500 సిజేరియన్‌లు చేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
సిజేరియన్ ఎప్పుడు చేయాలంటే
–బిడ్డ బయటకు వచ్చే మార్గం దగ్గర ‘పెల్విస్’ అనే ఎముక ఉంటుంది. ఈ ఎముక నిర్మాణం చిన్నగా ఉంటే ఆపరేషన్ అవసరం అవుతుంది.
– సాధారణంగా బిడ్డ బరువు 3 కిలోల కంటే తక్కువ ఉంటుంది. బిడ్డ బరువు 4 కిలోలు ఉంటే సిజేరియన్ తప్పనిసరి.
– గర్భాశయ ముఖ ద్వారాన్ని ప్లసెంటా పూర్తిగా కప్పి వేయడం వల్ల రక్తస్రావం అధికంగా జరగొచ్చు. దీన్ని ఫ్లసెంటా ఫీలియా అంటారు. ఇది తల్లీ, బిడ్డ ప్రాణాలకు ప్రమాదం. ఈ సమయంలో సిజేరియన్ కచ్చితంగా చేయాలి
– ప్రసవ సమయంలో తలపైకి, కాళ్లు కిందికి ఉంటే..తలకు బదులుగా కాళ్లు ముందు బయటకు వస్తాయి. ఇలాంటప్పుడు శస్త్ర చికిత్స అవసరం.
– గతంలో గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చేసినట్లయితే సిజేరియన్ అవసరం అవుతుంది. దీనికి తోడు గర్భిణి బీపీ, డయాబెటిస్ సమస్యలు ఉన్నట్లయితే ఆపరేషన్ చేయాలి.
అనవసరం ..అనారోగ్యం
సిజేరియన్ ఆపరేషన్లతో మహిళలకు శారీరక, మానసిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. తొలి కాన్పు సిజేరియన్ అయితే.. మలి కాన్పు 90 శాతం సిజేరియన్ ద్వారానే జరుగుతుంది. ఇది మరిన్ని రుగ్మతలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ జరిగే సమయంలో ఇచ్చే మత్తు మందు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
గత ఆరునెలలుగా ప్రయివేటు ఆస్పత్రుల్లో జరిగని సిజేరియన్ల వివరాలు
జనవరి.. 1000
ఫిబ్రవరి.. 800
మార్చి.. 1200
ఏప్రిల్.. 952
మే... 1002
జూన్... 677
జులై.. 1260
మొత్తం..6891
ప్రభుత్వ ఆసుపత్రుల్లో...
జనవరి.. 510
ఫిబ్రవరి.. 473
మార్చి.. 525
ఏప్రిల్ 552
మే.. 524
జూన్ 500
జులై 509
మొత్తం –3593
Advertisement
Advertisement