రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న అసద్
- ఎంహెచ్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు అసద్
ఖమ్మం మామిళ్లగూడెం: ప్రధాని మోదీ చేపడుతున్న చర్యలు.. దేశంలోని కార్పొరేట్లకు, మతోన్మాదులకు ఊతమిస్తున్నాయని ముస్లిం హక్కుల పోరాట సమితి(ఎంహెచ్‌పీఎస్) జాతీయ అధ్యక్షుడు ఎండి.అసద్ విమర్శించారు. ‘ఉగ్రవాదం–అసహనం’ అంశంపై నగరంలోని శనివారం స్టేషన్ రోడ్‌లోని యంగ్ జెనరేషన్ హైస్కూల్‌లో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా అసద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం తన ఎజెండాను క్రమంగా అమలు చేస్తున్నదని, దళితులు.. ముస్లిం మైనార్టీలపై దాడులకు దిగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మోదీ తన తొలి సంతకాన్ని అంబాని కాంట్రాక్టుపై చేశారని దుయ్యబట్టారు.
ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షుడు జియాఉద్దిన్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ‘విభజించు–పాలించు’ విధానాల కారణంగానే దేశంలో ఉగ్రవాదం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్స్ జేఏసీ నాయకులు డాక్టర్ పాపారావు, కెవి.కృష్ణారావు మాట్లాడుతూ.. ఎవరి ఆహారపు అలవాట్లు వారివని, వాటిని తప్పుబట్టి దాడులు చేయడం పద్ధతి కాదని అన్నారు. ప్రశ్నించే వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరించడం సరైంది కాదన్నారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు భద్రూనాయక్, శ్రీలక్ష్మి, వెంకటేశ్వర్లు, నజీర్ అహ్మద్, వెంకరమణ, అక్బర్ మూసా, ఛోటా బాబా తదితరులు పాల్గొన్నారు.