ధనార్జనే లక్ష్యంగా ప్రభుత్వ పాలన
ధనార్జనే లక్ష్యంగా ప్రభుత్వ పాలన
Published Sun, Sep 18 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
∙హోదా వద్దన్నందుకే చంద్రబాబుకు పోలవరం బహుమతి
∙శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు
సి.రామచంద్రయ్య ధ్వజం
∙డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ధనేకుల
మచిలీపట్నం టౌన్ :
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీకి ఒప్పుకున్నంనదుకే కేంద్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబుకు పోలవరం నిధులను బహుమతిగా ఇచ్చిందని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు చెన్నంశెట్టి రామచంద్రయ్య అన్నారు. రాష్ట్రంలో ధనార్జనే లక్ష్యంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ జిల్లా 28వ అధ్యక్షుడిగా నియమితులైన ధనేకుల మురళీమోహనరావు బాధ్యతల స్వీకారోత్సవం ఆదివారం స్థానిక డీసీసీ కార్యాలయంలో నిర్వహించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి నరశింహారావు అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా రామచంద్రయ్య హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల్లో రూ.1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్లు కొట్టేసేందుకు చంద్రబాబు పథకం రచించారని ఆరోపించారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలను రూపొందిస్తుందని, చంద్రబాబు మాత్రం స్వలాభం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం నిర్మాణంపై చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకు ఇంజినీర్లే తలలు పట్టుకుంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును నదుల అనుసంధానం కోసం రూపొందించిన కాంగ్రెస్ పార్టీ... దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పనులు ప్రారంభించిందని చెప్పారు. కుడి, ఎడమ కాలువలను కూడా తవ్వారని తెలిపారు. అయితే చంద్రబాబు తానే నదులను అనుసంధానం చేస్తున్నట్లుగా ప్రకటనలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర మాజీ మంత్రి ఎం.పళ్లంరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా నుంచే పాలన చేస్తోందని, ఈ జిల్లాలోని ప్రజల సమస్యలను గుర్తించి పోరాడాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకుడు ఎస్‌కే మస్తాన్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి డీసీసీ నూతన అధ్యక్షుడు, నాయకులు ప్రణాళికాబద్ధంగా పని చేయాలన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ 2019లో కాంగ్రెస్ పార్టీ కేంద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు నెలకొల్పేలా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మురళీమోహనరావు మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శులు ఎం.రామకృష్ణ, ఎ.శ్రీనివాసకుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి గుమ్మడి విద్యాసాగర్, బందరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఎన్.రాధికా మాధవి, పట్టణ అధ్యక్షుడు అబ్దుల్æమతీన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విజయశేఖర్, జిల్లా డిస్ట్రీబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మయ్య, ఆర్టీసీ రీజియన్ మాజీ చైర్మన్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement