వీడని హత్యల మిస్టరీ
* ఏళ్లు గడుస్తున్నా కేసుల్లో పురోగతి శూన్యం
* ఒక్క క్లూ కూడా లభించని వైనం
కామవరపుకోట : హత్యలు జరిగి ఏళ్లు గడుస్తున్నాయి. హతులు ఎవరు, హంతకుల ఆచూకీ, హత్యకు గల కారణాలేమీ తెలియడం లేదు. ఈ రెండు హత్యల్లో ఒక్క క్లూ కూడా పోలీసులకు లభించలేదు. చింతలపూడి పోలీస్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మిగిలిన ఈ రెండు హత్యకేసుల్లో పురోగతి లేదు. ఒక హత్య జరిగి దాదాపు పందొమ్మిదేళ్లు గడవగా మరో హత్య జరిగి ఏడాది పూర్తయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి..
గతేడాది ఏప్రిల్ 26న మండలంలోని ఆడమిల్లి వద్ద పుంతలో ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం ఉన్న తీరును బట్టి హత్యగా నిర్దారించారు. హతురాలు శ్రీకాకుళం పరిసర ప్రాంతాలకు చెందినదిగా భావించారు. మృతురాలి మెడ కింద తాడు వంటి దానితో బిగించిన గుర్తులున్నాయని, ఎక్కడో చంపి ఇక్కడ పడవేసి ఉంటారని అప్పట్లో పోలీసులు చెప్పారు.
కేసు చేధించేందుకు అప్పటి జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు ఆధ్వర్యంలో నాలుగు పోలీసు బృందాలను పంపారు. మండల సమీపంలోని ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకు శ్రీకాకుళం పరిసర ప్రాంతాల నుంచి కార్మికులు వస్తుంటారు. ఈ కారణంతో ఫ్యాక్టరీల్లో కార్మికులను విచారించినా ఫలితం లేదు. ఇదంతా జరిగి ఏడాది గడుస్తున్నా కేసులో ఏ మాత్రం పురోగతిలేదు. హతురాలు, హత్యకు గల కారణాలు, హంతకుల వివరాలేమీ లభ్యం కాలేదు. కనీసం ఆమె పేరు, ఊరు తెలిసినా కేసును చేధించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అడవిలో అఘాయిత్యం
అడవిలోని ఓ బండరాయిపై రక్తపు మరకలు, మద్యం సీసాలు, సిగరెట్లు, పేకలు, కాలిపోయిన తెల్లచొక్కా కాలర్ ముక్క, కాలిపోయిన పసుపు రంగు నైలాన్ తాడుముక్క, హవాయి చెప్పుల మధ్య పడి ఉన్న ఓ వ్యక్తి మృతదేహం. మృతుడి ముఖాన్ని గుర్తుపట్టడానికి వీలు లేకుండా రాళ్లతో చితక్కొట్టిన వైనం. ఇదంతా జరిగి దాదాపు 19 ఏళ్లు గడుస్తున్నాయి. అయితే ఇప్పటికీ హతుడు వివరాలు లభ్యం కాలేదు.
టి.నరసాపురం మండలం అల్లంచర్లరాజుపాలెం అడవిలో జెండా గట్టుపై 1997 డిసెంబర్ 27న ఓ మృతదేహన్ని చూసిన అప్పటి ఫారెస్ట్ గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తడికలపూడి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి హత్యగా నిర్దారించారు. హత్య కేసుగా నమోదు చేశారు. మృతుడికి సుమారు 50 ఏళ్ల వయసు ఉంటుందని అప్పట్లో భావించారు. మృతుడు దృఢంగా, ఆరోగ్యవంతంగా ఉంటాడని పేర్కొన్నారు. ఇదంతా జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ దీనికి సంబంధించిన వివరాలు లభ్యం కాలేదు. ఈ కేసులో చిక్కుముడీ వీడలేదు.
ముమ్మరంగా ప్రయత్నించాం
హతురాలి ఆచూకీ కోసం ముమ్మరంగా ప్రయత్నించాం. పొరుగు జిల్లాలకు, తెలంగాణ పోలీస్‌స్టేషన్లకు కూడా సమాచారం ఇచ్చాం. ఇప్పటివరకు ఎటువంటి క్లూ లభించలేదు. కేసు దర్యాప్తులో ఉంది.
- జి.దాసు, ఇన్‌స్పెక్టర్, చింతలపూడి సర్కిల్
ఏడేళ్ల వరకు రన్నింగ్‌లో..
ఏడేళ్ల వరకు ఫైల్ రన్నింగ్‌లో ఉంటుంది. అనంతరం తాత్కాలికంగా క్లోజ్ చేసినా తర్వాత ఎప్పుడు కేసుకు సంబంధించిన ఆధారాలు లభించినా ఫైల్‌ను తిరిగి ఓపెన్ చేస్తాం.
- జీజే విష్ణువర్దన్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, తడికలపూడి పోలీస్‌స్టేషన్