రైతులపై సర్కారు వివక్ష
మేం అండగా ఉంటాం జిల్లాలో పార్టీని బలోపేతంచేస్తాం డీసీసీ అధ్యక్షుడు ఏలేటి
నిర్మల్ రూరల్ : రైతాంగాన్ని టీఆర్‌ఎస్ సర్కారు చిన్నచూపు చూస్తోందని, అన్నదాతలకు అండగా కాంగ్రెస్ నిలుస్తుందని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. స్థానిక నివాసంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాణహిత-చేవేళ్ల పథకంలో భూములు కోల్పోతున్న రైతులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. ఒక్కో గ్రామంలో ఒక్కో రకంగా భూమికి పరిహారం చెల్లించడమేంటని ప్రశ్నించారు. రైతులందరిదీ ఒక్కటే భూమి అయినప్పుడు వివక్ష ఎందుకు చూపుతున్నారన్నారు. మంత్రి బంధువే ఈ పనులను చేపడుతున్నారని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం కోల్పోతున్న భూమికి మార్కెట్ రేటుపై నాలుగురేట్లు ఎక్కువగా ఇవ్వాల్సి ఉందన్నారు. పూర్తిగా భూమిని కోల్పో తే 20 ఏళ్ల పాటు పింఛన్‌తో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఇవేవీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
విద్యుత్ లైన్ల కోసం పంట భూముల్లో వేస్తున్న స్తంభాలకు నిజామాబాద్‌లో రూ.2 లక్షల వరకు పరిహారం ఇస్తుండగా, జిల్లాలో మాత్రం రూ.40 వేల వరకు మాత్రమే ఇస్తున్నారన్నారు. ఖరీఫ్ ప్రారంభమైనా రైతులకు ఇప్పటికీ సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.
ఎంవీఐ తీరుపై మండిపాటు
స్థానిక ఎంవీఐ మంత్రికి సన్నిహితున్నంటూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆటోవాలాలపై దురుసుగా వ్యవహరిస్తున్నారని, వారు తనకు దీనిపై ఫిర్యాదు చేశారని చెప్పారు. ఆయన తీరు ఇలాగే కొనసాగితే తాము ఉద్యమిస్తామని వారు చెప్పారని, వారికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని చెప్పారు. జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకు సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సాద సుదర్శన్, తక్కల రమణారెడ్డి, అజర్, జమాల్, సరికెల గంగన్న, అయిర నారాయణరెడ్డి, గణేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.