మోగింది జేగంట
► అంతకు ముందే పండింది ఆఫర్ల పంట
► అమల్లోకి వచ్చిన వస్తుసేవల పన్ను
► వ్యవస్థ మారినా.. శాఖ మారలేదు
► ఉత్తర్వులే రాలేదంటున్న వాణిజ్యపన్నుల అధికారులు
శుక్ర వారం అర్ధరాత్రి గడియారం ముళ్లు రెండూ ఒకేచోటికి చేరడంతోనే ఆర్థిక రంగంలో కొత్త శకం శ్రీకారం చుట్టుకుంది. దేశమంతా మార్మోగిన జీఎస్టీ(వస్తు సేవల పన్ను) గంట రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖను కూడా తట్టి లేపింది. అయితే అంతకుముందే నగరవాసులను భారీ ఆఫర్ల వర్షం ముంచెత్తింది. ఉదయం నుంచీ షాపింగ్‌మాల్స్ కళకళలాడాయి. భారం మోపే పాత స్టాకును దాదాపు 80 శాతం వరకు క్లియర్ చేసుకోగలిగామని పలువురు నిర్వాహకులు తెలిపారు.
ఈ ఏకరూప పన్ను విధానం కొన్ని రంగాలకు ఊరటనిస్తే.. మరికొన్నింటిపై భారం మోపుతోంది. జీఎస్టీపై భిన్నాభిప్రాయాలు.. కొంత అయోమయం ఉన్నా.. వాటితో ప్రమేయం లేకుండానే అది జనం ముంగిటికి వచ్చేసింది. దీని అమలును పర్యవేక్షించాల్సిన వాణిజ్య పన్నుల శాఖ మాత్రం ఇంకా సిద్ధం కాలేదు. తమకు దీనిపై ఎటువంటి ఉత్తర్వులు రాలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
– విశాఖ సిటీ