-
కట్లెట్‌పై యమక్రేజీ
-
ఊరిస్తున్న పానీపూరీ
-
ఆసక్తి చూపుతున్న నగరవాసులు
-
సాయంత్రమైతే చాలు.. దుకాణాల వద్ద సందడేసందడి
కరీంనగర్ బిజినెస్: కట్లీస్, సమోసా కట్లీస్, పానీపూరి, బేల్‌పూరి, పాపడ్ కట్లీస్, పన్నీర్ కట్లీస్ ..చెబుతుంటేనే నోరూరుతోంది కదూ..! చిన్నాపెద్ద తేడా లేకుండా.. కాలంతో సంబంధం లేకుండా అందరూ ఇష్టపడే తినుబండారాలు ఇవి. హాట్‌హాట్ కచోరీలు, సాసర్ల కొద్ది సమోసాలు, ప్లేట్ల కొద్ది పానీపూరీని నగరవాసులు ఇష్టంగా లాగేస్తున్నారు. సాయంత్రమైందంటే చాలు.. వీటికోసం ప్రత్యేకంగా ఏర్పాటయిన బండ్లు, దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. వీటివల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు సైతం చెబుతుండడంతో మరింత ఇష్టంగా తినేస్తున్నారు.
సాయంత్రం పూట నగరవాసుల్లో చాలా మంది ఇష్టంగా తినే తినుబండారాలు అంటే కట్లేట్, పానీపూరీ అనే చెప్పాలి. చిన్న పిల్లల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు పానీపూరి తింటూ వాహ్ అంటున్నారు. స్నేహితులతో కలసి పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ లాగించేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
నగరమంతటా బండ్లు
నగరంలోని అన్ని ప్రాంతాల్లో తోపుడుబండ్లపై వీటిని విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వీటికి ప్రత్యేకంగా దుకాణాలు ఏర్పాటయ్యాయంటే అతిశయోక్తికాదు. వాతావరణంతో.. సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ వీటిని తినేందుకు క్యూ కడుతుంటారు. కమాన్ చౌరస్తా, గీతాభవన్, టవర్‌సర్కిల్, మంకమ్మతోట, కోర్టు చౌరస్తా, మంచిర్యాల్‌చౌరస్తా, రాంనగర్, గణేశ్‌నగర్‌తోపాటు ప్రధాన కూడళ్లలో పదుల సంఖ్యలో చాట్‌బండార్‌లు దర్శనమిస్తుంటాయి. వివిధ పనుల నిమిత్తం నగరానికి వచ్చిన వారు, కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు చాట్ రుచులను ఆస్వాదిస్తున్నారు.
యువత సందడి
చాట్ బండార్‌లన్నిటి వద్ద సందడి అంతా యువత సందడే అధికం. భారత్ థియేటర్ చౌరస్తా, గీతాభవన్ చౌరస్తా, టవర్‌సర్కిల్‌లోని పలు చాట్‌బండార్‌ల వద్ద విద్యార్థులతో కిటకిటలాడుతుంటాయి. ట్యూషన్ క్లాసులకు వెళ్తూ, కాలేజ్ నుంచి ఇంటికివస్తూ.. స్నేహితులతో బయటకు వెళ్లినవారు పానీపూరి తినకుండా ఉండడం లేదు. సమోసా కట్లీస్ రూ.12 నుంచి తినుబండారాన్ని బట్టి రూ.20 వరకు ఉంది. పానీపూరి రూ.ఐదు నుంచి రూ.10కి నాలుగు చొప్పున ఇస్తున్నారు.
చిన్నపిల్లల మారాం
సాయంత్రం అయిందంటే చిన్న పిల్లలు కట్లీస్ కావాలని మారాం చేస్తున్నారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. త్వరగా హోంవర్క్ పూర్తిచేస్తే కట్లీస్ తినిపిస్తామని తల్లిదండ్రులు కూడా ఆఫర్ ఇస్తున్నారు. మరికొందరు తమ పిల్లల కోసం ప్యాక్ చేసి తీసుకెళ్తున్నారు.
చాలామందికి ఉపాధి
కట్లీస్ బండ్లతో చాలామంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో జిల్లాకు చెందిన వారు పదిశాతం ఉంటే.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఏకంగా 90శాతం ఉన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌తోపాటు వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చి ఈ కట్లీస్ బండ్లు పెట్టుకుని ఉపాధి పొందుతున్నారు.
పల్లెలకూ పాకిన పానీపూరి
నగరవాసులతోపాటు గ్రామీణ ప్రాంతాలవానూ కట్లీస్ అంటే ఇష్టపడుతున్నారు. జగిత్యాల, హుజూరాబాద్, హుస్నాబాద్, గోదావరిఖని, సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు ప్రతి పల్లెలోనూ చాట్‌బండార్‌లు ఏర్పాటయ్యాయి.
సాయంత్రం గిరాకీ ఎక్కువ
– అశోక్, చాట్‌బండార్ నిర్వాహకుడు
కట్లీస్ తినేవారు సాయంత్రమే అధికంగా వస్తారు. కళాశాలలు, పాఠశాల విద్యార్థులు ఇందుకు మినహాయింపేమీకాదు. గతంలో మా నాన్న ఇదే వ్యాపారం చేశాడు. ఆయన తర్వాత నేనూ ఇదే వ్యాపారాన్ని చేపట్టాను. కట్లీస్, పానీపూరి, బేల్‌పూరి వంటి రకాలను యువత ఇష్టపడుతోంది. పానీపూరికి గిరాకీ ఎక్కువ.
చాలా ఇష్టం
–జీవన్, ఉద్యోగి
కట్లీస్ అంటే చాలాఇష్టం. చిన్నప్పటినుంచి పానీపూరి తినడం అలవాటయింది. స్నేహితులతో కలసి చాట్, పానీపూరి తింటుంటాం. చలికాలంలో ఎక్కువగా తింటాం. సాయంత్రం అయిందంటే దుకాణాల వద్ద సందడిగా ఉంటుంది. సమోసా కట్లీస్ అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా, కాలానికి, వాతావరణానికి సంబంధం లేకుండా తినేదంటే అది చాట్ మాత్రమే.