ఆలయాభివృద్ధికి కృషి | IV Rohit takes charge as Annavaram temple Chairman | Sakshi
Sakshi News home page

ఆలయాభివృద్ధికి కృషి

Published Fri, Jun 24 2016 9:07 AM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

IV Rohit takes charge as Annavaram temple Chairman

  • భక్తులకు సౌకర్యాల కల్పనే ధ్యేయం
  • అన్నవరం దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త రోహిత్
  • అనివేటి మండపంలో ప్రమాణ స్వీకారం
  •  
    అన్నవరం : అన్నవరం దేవ స్థానం అభివృద్ధికి త్రికరణశుద్ధిగా కృషి చేస్తానని ఆరో వ్యవస్థాపక ధర్మకర్త రాజా ఇనుగంటి వేంకట రోహిత్ అన్నారు. ధర్మకర్తగా ఆయన గురువారం ఉదయం 7.44 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. దేవస్థానంలోని  అనివేటి మండపంలో సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవ మూర్తుల వద్ద  ఆయనతో ఈఓ నాగేశ్వరరావు ప్రమాణం చేయించారు.

    ‘సత్యదేవుని సాక్షిగా దేవస్థానానికి సంబంధించిన ఏ రహస్యాన్ని వెల్లడించనని, దేవస్థానం అభివృద్ధికి పాటుపడతానని, భక్తుల సౌకర్యాల కల్పనే ధ్యేయంగా వ్యవహరిస్తానని రోహిత్ ప్రమాణం చేశారు. ముఖ్యఅతిథిగా ద్వారకా తిరుమల దేవస్థానం చైర్మన్, వ్యవస్థాపక ధర్మకర్తల సంఘం అధ్యక్షుడు ఎస్‌వీ సుధాకరరావు హాజరు కాగా తుని మార్కెట్ యార్డు చైర్మన్ యనమల కృష్ణుడు తదితరులు హాజరయ్యారు. రోహిత్  ఇంగ్లీషులో ప్రమాణం చేయడం పూర్తి కాగానే పలువురు సత్కరించారు. అధికారిక లాంఛనాలతో పండితులు స్వాగతం పలికి  ఆలయానికి తీసుకువెళ్లారు. వేదపండితులు ఆశీస్సులందచేశారు.
     
    తండ్రి బాటలో ఆలయాన్ని అభివృద్ది చేయాలి
    సుమారు 37 ఏళ్లు దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తగా వ్యవహరించిన తండ్రి దివంగత రామ్‌కుమార్ బాటనే రోహిత్ అనుసరించి దేవస్థానాన్ని అభివృద్ధిపథంలో నడపాలని ద్వారకాతిరుమల దేవస్థానం చైర్మన్ సుధాకర్‌రావు కోరారు. రాష్ట్రం లో వ్యవస్థాపక ధర్మకర్తలున్న సింహాచలం, ద్వారకాతిరుమల, అన్నవరం దేవస్థానాలు బాగా అభివృద్ధి చెందడం విశేషమన్నారు. కార్యక్రమంలో ఏసీ జగన్నాథరావు, ఏఈఓలు మూర్తి, రామ్మోహన్‌రావు,  ప్రసాద్, కర్రా శ్రీనివాస్, సత్యవతీదేవి, ఈఈ నూకరత్నం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement