మెట్టకు ముప్పు | mettaku muppu | Sakshi
Sakshi News home page

మెట్టకు ముప్పు

Published Thu, Jun 22 2017 6:56 PM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM

మెట్టకు ముప్పు

మెట్టకు ముప్పు

చింతలపూడి : మెట్టప్రాంత వర ప్రదాయని తమ్మిలేరు రిజర్వాయర్‌ ప్రాజెక్టుకు ఇప్పట్లో కష్టాలు గట్టెక్కేలా లేవు. గతేడాది సకాలంలో వర్షాలు కురవడంతో పాక్షికంగా నిండిన ప్రాజెక్టు ప్రస్తుతం మెట్టలో ఏర్పడిన వర్షాభావం వల్ల ప్రాజెక్టు నీటిమట్టం డెడ్‌ స్టోరేజ్‌కు చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకు సరైన వర్షాలు కురవకపోవడంతో జలాశయంలోకి నీరు చేరలేదు. ప్రస్తుతానికి నీటి మట్టం 327 అడుగులకు చేరుకుంది. రాష్ట్ర విభజనతో జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటిపై రెండు జిల్లాల రైతులు ఆశలు వదులుకున్నారు. దీంతో ప్రాజెక్టు పరిస్థితిపై  రైతులు ఆందోళన చెందుతున్నారు. 
ప్రశ్నార్థకంగా ప్రాజెక్టు ఉనికి
నాలుగు దశాబ్దాలుగా మెట్ట రైతుల పాలిట కల్పతరువుగా ఉన్న తమ్మిలేరు రిజర్వాయర్‌కు శాశ్వత సాగునీటి జలాలు కల్పించాలనే డిమాండ్‌ ఎన్నో ఏళ్లుగా ఉంది. కొన్నాళ్లుగా ఈ రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతం నుంచి సమృద్ధిగా నీరు రాకపోవడంతో ఆయకట్టు రైతులకు నీరందడం లేదు. రాష్ట్ర విభజన అనంతరం ఖమ్మం జిల్లాలో స్థానిక రైతులు కాలువకు అడ్డుకట్ట వేయడంతో వర్షం నీరు ప్రాజెక్టుకు రావడం లేదు. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టు ఉనికి ప్రమాదంలో పడింది. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోపోతే తమ పొలాలు బీళ్లుగా మారే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. 
35 వేల ఎకరాల ఆయకట్టు
తమ్మిలేరు ప్రాజెక్టు నిర్మించి 40 ఏళ్లు దాటి పోయింది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 355 అడుగులు. రిజర్వాయర్‌ ఎగువ భాగంలో 20 వేల ఎకరాలు, దిగువ భాగంలో ఏలూరు వెళ్లే ఇరుపక్కలా 15 ఏటి కాలువల ద్వారా 14,200 ఎకరాలు సాగవుతున్నాయి. జిల్లాలోని తలార్లపల్లి, యర్రంపల్లి, యడవల్లి, కళ్యాణంపాడు, తువ్వచెలక రాయుడుపాలెం, గ్రామాలకు చెందిన 475 ఎకరాల పల్లం భూములకు ,3,769 ఎకరాల మెరక భూములకు నీటి సరఫరా జరుగుతోంది. కృష్ణా జిల్లాలో పోలవరం, చాట్రాయి, తుమ్మగూడెం, మంకొల్లు, సోమవరం గ్రామాల్లో 1,855 ఎకరాల పల్లం భూములకు 3,070 ఎకరాల మెరక భూములకు సాగునీరు లభిస్తుంది.
విభజన వల్ల అసలు కష్టాలు 
రాష్ట్ర విభజన వల్ల అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. గోదావరి నది నుంచి  ఎత్తిపోతల ద్వారా జలాలను మళ్లించి 36 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇందిరాసాగర్‌ ఎత్తిపోతల పథకం రూపొందించారు. వైఎస్‌ మృతి చెందాక ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఆగిపోయాయి. రాష్ట్ర విభజనతో తెలంగాణా నుంచిì  ఆంధ్రాలో చేరిన విలీన మండలాలతో అసలు సమస్య వచ్చి పడింది. ఎత్తిపోతల ప్రాంతం విలీన మండలాల్లో ఉండటంతో తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాజెక్టు పట్ల కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక ఆంధ్రా కాలువ ద్వారా తమ్మిలేరుకు వచ్చే వరద నీరు రాకుండా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లిచెరువు అలుగు ఎత్తును పెంచడమే కాక ఇసుక బస్తాలు కూడా వేయడంతో వరద నీటిపై ఆశలు గల్లంతయ్యాయి.  
ఎత్తిపోతలే శరణ్యం
తమ్మిలేరు ప్రాజెక్టుకు తిరిగి పూర్వ వైభవం రావాలంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను మళ్లించడం ఒక్కటే మార్గం. అయితే ఎత్తిపోతల పనులు ఎప్పటికి పూర్తవుతాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చింతలపూడి ఎత్తిపోతలకు భూసేకరణ అడ్డంకిగా మారడంతో ఇప్పట్లో పథకం పూర్తయ్యే అవకాశాలు లేవు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రాకాలువ ద్వారా తమ్మిలేరుకు మళ్లిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తమ్మిలేరు భవిష్యత్‌పై దృష్టి సారించాలని, చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
‘ఎత్తిపోతల’ను పూర్తి చేయాలి              
తమ్మిలేరుకు గోదావరి జలాలను తరలించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయాలి. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసి తమ్మిలేరుకు సాగునీరు అందించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా పథకానికి నిధులు విడుదల చేసి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి.
- దయాల నవీన్‌బాబు, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, చింతలపూడి 
 
ఎగువ నుంచి నీరు వస్తేనే.. 
ఎగువ నుంచి వరద నీరు వస్తేనే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంటుంది. అక్కడి ప్రభుత్వం క్రిందికి నీరు రాకుండా అడ్డుకుంటోంది. అయితే జూలై, ఆగష్టు నెలల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు నిండుతుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.- ఎం.అప్పారావు, డీఈ, తమ్మిలేరు ప్రాజెక్టు 

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement