కౌలాబాయి, నాగ్‌నాథ్
-
తల్లీకొడుకులు మృతి
-
వైద్యానికి అడ్డు వచ్చిన వాగు
-
మరొకరి పరిస్థితి విషమం
-
వైద్యం కోసం తరలింపు
-
మేడిగూడలో విషాదం
నార్నూర్ : నార్నూర్ మండలం మేడిగూడ గ్రామంలో డయేరియాతో తల్లీకొడుకులు మంగళవారం మృత్యువాతపడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మేడిగూడ, గాదిగూడ మధ్యలో ఉన్న గాదిగూడ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో వైద్యం అందక చనిపోయారు. మేడిగూడ గ్రామానికి చెందిన మానే కౌలాబాయి, మానే నాగ్‌నాథ్ రెండ్రోజులుగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. స్థానికంగా వైద్యం చేయించినా నయం కాలేదు.
మంగళవారం సాయంత్రం వాంతులు, వీరేచనాలు ఎక్కువ కావడంతో ఇద్దరినీ నార్నూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఉన్న గాదిగూడ వాగులో భారీగా వరద నీరు చేరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగు దాటలేక.. సమయానికి వైద్యం అందక మానే నాగ్‌నాథ్(28) అక్కడే మృతిచెందాడు. కౌలాబాయి(60)ను అక్కడి నుంచి మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన జీవితికి వైద్యం కోసం తరలిస్తుండగా.. మార్గమధ్యంలో చనిపోయినట్లు ఆమె భర్త మానే కిషన్ తెలిపారు.
కాగా.. అదే ఇంట్లో నాగ్‌నాథ్ చిన్న కొడుకు సందీప్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యం కోసం జీవితికి తరలించినట్లు తెలిపారు. ఒకే ఇంట్లో ఇద్దరు మృతిచెందడంతోపాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.