దారులన్నీ దిగ్బంధం
-
కోనసీమ ప్రవేశ మార్గాలైన వంతెనల వద్ద పోలీసు చెక్ పోస్టులు
-
నాలుగు వేల మందితో బలగాల మోహరింపు
-
అడుగుకో పోలీసు ... ఖాకీల వలయంలో కోనసీమ
-
కాపుల పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసుల వ్యూహం
-
డ్రోన్లు, బాడీ హోల్డ్, కెమెరాలతో చిత్రీకరణకు ఏర్పాట్లు
-
చాప కింద నీరులా యాత్రకు సమాయత్తం
అమలాపురం టౌన్ :
కాపుల సత్యాగ్రహ పాద యాత్రను ఎలాగైనా అడ్డుకునేందుకు జిల్లా పోలీసు శాఖ అస్త్ర, శస్రా్తలను సంధిస్తోంది. ఇప్పటికే జిల్లాకు ముఖ్యంగా కోనసీమకు, మెట్ట ప్రాంతాల్లోని కిర్లంపూడి మండలానికి దాదాపు నాలుగు వేల మంది పోలీసులను రంగంలోకి దింపి భారీ బందోబస్తు ఏర్పా టు చేస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ బలగాలను దింపింది. ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ కోనసీమలో సాగే కాపుల యాత్ర ఇప్పటికే కాపు జేఏసీ రూట్ మ్యాప్‌తో సమాయత్తమైన విషయం తెలిసిందే. కోనసీమలోని కాపులను ఆ రోజు రావులపాలెం చేరుకోకుండా చూడడమే కాకుండా జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి యాత్రకు వచ్చే కాపు నాయకులు, కార్యకర్తలు కూడా అడుగు పెట్టేందుకు వీలు లేకుండా పలుచోట్ల పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కోనసీమలోకి ప్రవేశించే మార్గాలైన పలు నదులపై ఉన్న సిద్ధాంతం వంతెన, జొన్నాడ వంతెన, బోడసకుర్రు వంతెన, ఎదుర్లంక వంతెన, ముక్తేశ్వరం తదితర చోట్ల ఈ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వాహనం చెక్ చేసి కోనసీమలోకి పంపించేలా పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. కోనసీమలో యాత్ర సాగే 11 మండలాలకు సంబంధించి ఒక్కో మండలానికి జిల్లాల నుంచి వచ్చిన పోలీసు బలగాలను బందోబస్తుగా ఉంచారు. ఉదాహరణకు అమలాపురం పట్టణానికి చిత్తూరు జిల్లా, అంబాజీపేట మండలానికి కడప జిల్లా పోలీసు బలగాలను మోహరింప చేశారు. సోమవారం సాయంత్రానికి కోనసీమ పూర్తి గా ఖాకీల ఆధీనంలోకి వస్తుంది. యాత్ర బందోబస్తు, పహారా, యాత్రకు సమాయత్తమ య్యే దృశ్యాలను చిత్రీకరించేందుకు డ్రోన్లు, బాడీ హోల్డ్ కెమేరాలను సిద్ధం చేశారు. యా త్రలో పాల్గొనే నాయకులను, కార్యకర్తందర్నీ గుర్తించే విధంగా చిత్రీకరణకు సూచనలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి రాపిడ్ యాక్ష¯ŒS ఫోర్సు బలగాలను కూడా రప్పించారు.
రావులపాలెంపై ప్రత్యేక దృష్టి...
యాత్ర ప్రారంభమయ్యే రావులపాలెంపై బందోబస్తు పరంగా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒక్క రావులపాలెంలోనే దాదాపు వెయ్యి మంది పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. కాపు నేతలు యాత్రకు ముందు రోజు రావులపాలెం చుట్టూ ఉన్న గ్రామాల్లో బస చేసి ఉదయానికి వేలాదిగా చేరుకొని వలయంగా ఏర్పాటై పాదయాత్రకు ఆటంకం లేకుండా వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయం పసిగట్టిన పోలీసులు రావులపాలెంలో ఉన్న దాదాపు 13కు పైగా ప్రవేశ మార్గాలను కూడా దిగ్బంధనం చేస్తున్నారు. మంగళవారం కాపు ఉద్యమ నేతలను గృహ నిర్బంధంతో నిలువరింపజేసే దిశగా కసరత్తు చేస్తున్నారు.