ప్రయాణంలో పెను విషాదం | prayanamlo penu vishadam | Sakshi
Sakshi News home page

ప్రయాణంలో పెను విషాదం

Published Mon, Aug 22 2016 10:16 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

ప్రయాణంలో పెను విషాదం

ప్రయాణంలో పెను విషాదం

సాక్షి ప్రతినిధి, ఖమ్మం/కూసుమంచి : హైదరాబాద్‌ వెళ్లి తిరుగు పయనమైన వారంతా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అదే వారికి చివరి ప్రయాణమైంది. వారి కుటుంబాల్లో విషాదచీకట్లు నింపింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం గ్రామంలోని సాగర్‌ ఇన్‌ఫాల్‌ రెగ్యులేటరీ గేట్ల వద్ద సోమవారం తెల్లవారుజామున 2.40 గంటల ప్రాంతంలో ఓ ప్రై వేటు బస్సు ఎన్‌ఎసీప కాలువలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో పదిమంది దుర్మరణం పాలయ్యారు. 18 మందికి తీవ్ర,  ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతులంతా ఉభయగోదావరి జిల్లావాసులే.  వీరిలో ముగ్గురు పశ్చిమ వాసులు ఉన్నారు. 
బస్సు ఎప్పుడు.. ఎంత మందితో బయలుదేరింది..
హైదరాబాద్‌లోని మియాపూర్‌ నుంచి  నెల్లూరు జిల్లాకు చెందిన యాత్రాజీని టూరిస్టు బస్సు కాకినాడకు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో బయలుదేరింది. ఇద్దరు డ్రై వర్లు, ఒక క్లీనర్‌తో సహా 31 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన అనంతరం సూర్యాపేటకు సోమవారం తెల్లవారుజామున 1.10 గంటలకు బస్సు చేరుకోగా.. అక్కడ టీ విరామానికి బస్సును నిలిపారు. తిరిగి బస్సు 1.30 గంటలకు బయలుదేరింది. సూర్యాపేట వరకు బస్సును శ్రీను అనే డ్రై వర్‌ నడపగా.. అక్కడి నుంచి కిషోర్‌ అనే డ్రై వర్‌ నడిపాడు. అనంతరం కొద్ది నిమిషాలకే కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద ఉన్న ఎన్నెస్పీ కాల్వ వద్ద బ్రిడ్జిపై బస్సు ప్రమాదానికి గురైంది. 
అదుపుతప్పి.. 
ఈ వంతెనపై అంతకుకొద్దిసేపు ముందు రెండు బస్సులు ఢీకొన్నాయి. అందులో ఒక బస్సు వంతెనపైనే నిలిచిపోయి ఉంది. యాత్రాజీని బస్సు అతివేగంగా వంతెనపైకి చేరుకోగానే అక్కడ మరో బస్సు నిలిపి ఉండడంతో దానిని తప్పించేందుకు డ్రై వర్‌ యత్నించాడు. ఈ సమయంలో బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా ఇన్‌ఫాల్‌ కాలువలోకి దూసుకెళ్లింది. బస్సు కాల్వలో బోల్తాపడటంతో అందులో చిక్కుకున్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. ఘటన జరిగినప్పుడు పెద్ద పెట్టున శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై ఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. పోలీసులూ వచ్చి సహాయక చర్యలు చేపట్టారు.  
చిమ్మ చీకటి.. ఆర్తనాదాలు..
బస్సు కాలువలో పడిన సమయంలో అంతా చిమ్మ చీకటి. ఏం జరిగిందో తెలుసుకునేలోపే పెద్ద ప్రమాదం జరిగిపోయింది. పెద్ద శబ్దాలు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని చూసేసరికి చిమ్మ చీకట్లో ఆర్తనాదాలు.. హాహాకారాలు వినిపించాయి. వెంటనే మత్స్యకారులు కాలువలోకి సెల్‌ఫోన్‌ లైట్ల వెలుతురులో చూడగా.. బస్సు బోల్తాపడిపోయి ఉంది. తేరుకున్న మత్స్యకారులు కాలువలోకి దూకి ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే కొందరు ప్రాణాలు విడిచారు. మత్స్యకారులు బస్సు అద్దాలను పగులగొట్టి కొంతమంది ప్రయాణికులను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిని ఖమ్మం, నేలకొండపల్లి నుంచి వచ్చిన 108 వాహనాల్లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
ఊపిరి ఆడక.. 
ఎన్నెస్పీ ఇన్‌ఫాల్‌ రెగ్యులేటర్‌ గేట్ల వద్ద ప్రమాదం జరగగా.. ఆ స్థలంలో వంతెన పైనుంచి 25 అడుగుల లోతులో కాలువ ఉంది. బ్రిడ్జి వద్ద ఇన్‌ఫాల్‌ రెగ్యులేటర్‌ గేట్లు ఉండటంతో సుమారు ఐదు అడుగుల మేర నీళ్లు నిలిచి ఉన్నాయి. కాగా.. బస్సు ప్రమాదానికి గురైనప్పుడు బ్రిడ్జి పైనుంచి కాలువలో బోల్తాపడింది. ఏసీ బస్సు కావడంతో అద్దాలు తొలగించే పరిస్థితి లేకపోవడంతో ప్రయాణికులంతా బస్సులోపలే ఉండిపోయారు. కాలువలో నిలిచి ఉన్న నీళ్లు నెమ్మదిగా బస్సులోకి చేరుకోవడం.. ఘటనను గమనించడంలో ఆలస్యం కావడంతో  ఊపిరి ఆడక ఎక్కువ సంఖ్యలో మృత్యువాతపడ్డారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న కూసుమంచి సీఐ కిరణ్‌కుమార్, ప్రొబేషనరీ ఎసై  ్స ప్రవీణ్‌ హుటాహుటిన నాయకన్‌గూడెం చేరుకుని.. బస్సులోని మతదేహాలను బయటకు తీయించారు.
ఇరుక్కుపోయిన మృతదేహాలు
బస్సు తలకిందులుగా బోల్తాపడటంతో లోపల ఉన్న ప్రయాణికులు సీట్ల మధ్య ఇరుక్కుపోవడం, వారిపై లగేజీ పడటంతో బయటకు రాలేక మృత్యువాతపడ్డారు. రాత్రి సమయంలో ఐదు మృతదేహాలను బయటకు తీయగా.. మరికొందరి మృతదేహాలు బస్సులో నుంచి బయటకు తీయడం కష్టతరంగా మారింది. దీంతో ఉదయం 8 గంటల సమయంలో రెండు భారీ క్రేన్లు తెప్పించి బస్సును కాలువ నుంచి బయటకు తీశారు. కాగా.. అప్పటికే బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. బస్సును క్రేన్ల సాయంతో బయటకు తీసే సమయంలో పలుమార్లు వేలాడుతున్న మృతదేహాలు బ్రిడ్జి పిల్లర్లకు తగలడం అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది. బస్సు వెలుపలికి తీసిన అనంతరం కూడా మృతదేహాలను బయటకు తీసేందుకు నానా యాతన పడాల్సి వచ్చింది. సుమారు రెండు గంటలు కష్టించి ఐదు మృతదేహాలను బస్సు నుంచి బయటకు తీశారు. డీఎస్పీ సురేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎసై  ్సలు సహాయక చర్యలు పూర్తయ్యేంత వరకు నాయకన్‌గూడెంలోనే ఉన్నారు. 
ఆస్పత్రిలో హాహాకారాలు
దుర్మరణం పాలైన పదిమంది మృతదేహాలను ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన 18 మందిని కూడా ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యం అందించారు. కాగా.. ఒకవైపు మృతదేహాల వద్ద బంధువుల హాహాకారాలు, మరోవైపు క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆస్పత్రి దద్దరిల్లింది.  
జిల్లాకు చెందిన క్షతగాత్రులు 
పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన బర్రెల లక్ష్మి, తాడేపల్లిగూడెంకు చెందిన చంద్రనాగ్, నిడమర్రు మండలం దేవరగోపవరంకు చెందిన మణి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో లక్ష్మి  హైదరాబాద్‌లోని చింతల్‌లో ఉంటూ స్వగ్రామం వచ్చేందుకు ఈ బస్సు ఎక్కారు. ప్రమాదంలో గాయపడ్డారు. చంద్రనాగ్‌  స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ఇండియా లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో యూనిట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. బ్యాంకు సమావేశం కోసం హైదరాబాద్‌ వచ్చిన ఆయన తిరుగుప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. చంద్రనాగ్‌కు కాలు విరగడంతో తాడేపల్లిగూడెం బ్యాంక్‌ అధికారుల సమాచారంతో ఖమ్మం ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అధికారులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రినుంచి వేరే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మణి హైదరాబాద్‌లోని బంధువుల పెళ్లికి వచ్చి తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరగడంతో గాయపడ్డారు.  
 
 
 

Advertisement
Advertisement