‘కూత’ పెట్టు.. పందెం కట్టు
- ప్రో కబడ్డీపై జోరుగా పందేలు
- చేతులు మారుతున్న రూ.లక్షలు
- పల్లెలకు పాకిన బెట్టింగ్‌లు
- పట్టించుకోని పోలీసు యంత్రాంగం
ఖమ్మం స్పోర్ట్స్
క్రికెట్‌పై బెట్టింగ్‌లు పాత మాట.. కబడ్డీపై బెట్టింగ్‌లు కొత్త మాట.. ప్రో కబడ్డీ ద్వారా కబడ్డీ ఆటకు విపరీతమైన క్రేజీ పెరిగింది.. పిల్లలు గల్లీల్లో కబడ్డీ ఆటకు ప్రాధాన్యం ఇస్తున్నారు.. సెలవులు వచ్చాయంటే కూత పెడుతూ ఆటకు సిద్ధమవుతున్నారు. కార్పొరేట్ క్రీడలకు ధీటుగా కబడ్డీ ఆటకు ప్రో కబడ్డీ ద్వారా మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో బెట్టింగ్ రాయుళ్ల కన్ను కబడ్డీ ఆటపై పడింది. నగరంలోని బార్లలో కూర్చొని జోరుగా పందేలు కాస్తున్నట్లు సమాచారం. మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన ఆట కబడ్డీ. ఇప్పుడు నగరాలతోపాటు పల్లెల్లో సైతం ప్రో కబడ్డీ ఎప్పుడు ఆరంభమవుతుందని క్రీడాభిమానులు ఎదురుచూస్తున్నారు. మరికొందరు ఆదాయమే మార్గంగా ఆటపై జోరుగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో బెట్టింగ్ జాడ్యం జోరుగా కొనసాగుతోంది. ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు ముగియనుండటంతో క్వాలిఫైయింగ్ జట్ల మీదే జోరుగా పందెం కాస్తున్నారు. ఇప్పటివరకు ప్రత్యర్థి జట్టు నుంచి ఓ ఆటగాడు పాయింట్ తెస్తే.. రూ.100 ఇస్తే.. రూ.వెయ్యి ఇచ్చే విధంగా కొందరు బుకీలుగా ఏర్పడి జోరుగా దండుకుంటున్నారు. నగరంలో సాయంత్రం వేళ బార్లలో కేవలం ప్రో కబడ్డీ మ్యాచ్‌లను చూసేందుకు మాత్రమే బెట్టింగ్ పాల్పడే వారు వస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు మద్యం సేవిస్తున్న మద్యంప్రియులు.. చివరకు తమ జేబులకు చిల్లులు పెట్టుకుని వెళ్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం నడుస్తున్నట్లు సమాచారం. ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం, మధిర, సత్తుపల్లి, వైరా లాంటి ప్రాంతాల్లో వయో బేధం లేకుండా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాభిమానులు ప్రో కబడ్డీ మ్యాచ్‌ల ప్రారంభానికి ముందే బెట్టింగ్ వేసుకుంటున్నారు. దీనిని ఆసరా చేసుకుని కబడ్డీ మోజులో బెట్టింగ్ పెట్టండి.. భారీగా నగదు చెల్లిస్తామని బుకీలుగా ఏర్పడిన కొందరు నమ్మబలుకుతున్నారు. కాగా.. ప్రధాన జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు మాత్రం బెట్టింగ్ జోరుగా సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్నా పైరేట్స్, తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబా జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతున్న సమయాల్లో బెట్టింగ్ రేటు మరింత ఎక్కవ అవుతున్నట్లు తెలుస్తోంది. లీగ్ మ్యాచ్‌ల సందర్భల్లోనూ బెట్టింగ్ జోరుగా కొనసాగినట్లు సమాచారం. దీనిని నియంత్రించాల్సిన పోలీసులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో వారం రోజులపాటు నడిచే ప్రో కబడ్డీకి బెట్టింగ్ బెడద లేకుండా చూస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.