వేలి ముద్రలు పడవు..ఉపకార వేతనాల్లేవు | student scholarship problem | Sakshi
Sakshi News home page

వేలి ముద్రలు పడవు..ఉపకార వేతనాల్లేవు

Published Sat, Feb 18 2017 12:09 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

వేలి ముద్రలు పడవు..ఉపకార వేతనాల్లేవు - Sakshi

వేలి ముద్రలు పడవు..ఉపకార వేతనాల్లేవు

విద్యార్థులతో సంక్షేమశాఖల చెలగాటం
జిల్లాలో దాదాపు 8 వేల మందికి ఇక్కట్లు
గత ఏడాదీ 2 వేల మందికి అవస్థలు
పట్టించుకోని ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, కాకినాడ :విద్యా సంవత్సరం ముగియడానికి గట్టిగా నెల రోజులు కూడా లేదు. చాలా మంది విద్యార్థులకు ఇప్పటికీ ఉపకార వేతనాలు అందలేదు. వారంతా సామాన్య, మధ్య తరగతి వర్గాలకు చెందిన ఎస్సీ, బీసీ, ఈబీసీ విద్యార్థులే. ప్రతి విద్యా సంవత్సరంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా ఉపకార వేతనాల కోసం విద్యార్థులు చదువుకుంటున్న కాలేజీల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆయా కాలేజీల్లో విద్యార్థుల వేలిముద్రలు సేకరించాలి. అదే విద్యార్థులకు పెద్ద సమస్యగా మారింది. వేలిముద్రలు నమోదు కాకపోవడంతో విద్యార్థుల ఉపకారవేతనాలు, కాలేజీల యాజమాన్యాలకు రావాల్సిన ఫీజు రీ యింబర్స్‌మెంట్‌ జమ కాక కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఈ రకంగా ఒకరు ఇద్దరు కాదు.. ఏడెనిమిదివేల మంది విద్యార్థులు నిత్యం సంక్షేమశాఖ అధికారులకు మొరబెట్టుకుంటూనే ఉన్నారు. కాలేజీలకు వెళ్లకుండా తిరిగినా ఫలితం దక్కడం లేదని  ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలో బీసీ కేటగిరీలో  76 వేల మంది, ఈబీసీ కేటగిరీలో 35 వేల మంది, ఎస్సీ కేటగిరీలో 36 వేల మంది, ఎస్టీ, మైనార్టీ కేటగిరీల్లో మరో 10 వేల మంది విద్యార్థులు ఇంటర్‌ నుంచి ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులు చదువుతున్నారు. వీరిందరికీ ప్రభుత్వం ఆయా సంక్షేమ శాఖల ద్వారా ఉపకారవేతనాలు అందిస్తోంది. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర విభాగాల విద్యార్థులకు రూ.40 వేలు, డిగ్రీ విద్యార్థులకు రూ.8 వేలు, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఆరేడు, వేలు.. ఇలా ఒకో కేటగిరీకి ఒకో రకమైన ఉపకారవేతనాలు ఇస్తున్నారు.
ప్రత్యామ్నాయం చూడరా..?
కాలేజీలో చేరిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాక తండ్రి, తల్లి, విద్యార్థి ఆధార్‌కార్డులు, కులం ధృవీకరణ, రేషన్‌కార్డు, బ్యాంక్‌ ఖాతా ఇలా అనేక ఆధారాలు నమోదు చేస్తారు. అన్నీ సరిచూసుకున్నాక సంబంధిత సంక్షేమశాఖ కార్యాలయం నుంచి విద్యార్థి చదువుతున్న కాలేజీకి క్లియరెన్స్‌  వస్తుంది. కాలేజీలో విద్యార్థుల వేలిముద్రలు నమోదుచేస్తారు.ఆ సమయంలోనే కొందరు విద్యార్థుల వేలిముద్రలు నమోదు కావడం లేదు. ఇలా వేలిముద్రలు నమోదు కాని విద్యార్థుల సంఖ్య జిల్లాలో ఏడెనిమిది వేల పైబడే ఉంది. అన్ని వేల మంది విద్యార్థుల వేలిముద్రలు నమోదు కాకపోవడాన్ని ప్రభుత్వం పెద్ద విషయంగా పరిగణించడం లేదు. అందుకే వారి మానాన వారిని వదిలేస్తోంది. చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం మెస్‌చార్జీలు, పాకెట్‌మనీ, కాలేజీ యాజమాన్యాలకు ట్యూష¯ŒS ఫీజు రీ యింబర్స్‌మెంట్‌ జమ చేస్తుంటుంది. విద్యార్థుల వేలిముద్రలు నమోదుకాకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు రెండోసారి మీ సేవ ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.100 చెల్లించి ప్రయత్నించినా ఫలితం కనిపించ లేదు. 
ఈ విషయం సంక్షేమశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళితే తామేమీ చేయలేమని చేతులెత్తేసి, విజయవాడ కమిషనరేట్‌కు వెళ్లమని సలహా  ఇస్తున్నారు. ఇటువంటి విద్యార్థుల నుంచి వేలిముద్రలకు ప్రత్యామ్నాయంగా ఐరిస్‌  అయినా తీసుకోవాలి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా గాలికొదిలేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అడకత్తెరలో పోకల్లా విద్యార్థులు
విద్యా సంవత్సరం ముగిసిపోతుండటంతో ఫీజులు చెల్లించాలని కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలో వేలిముద్రలు నమోదు కావడం లేదని జిల్లా నలుమూలల నుంచి నిత్యం విద్యార్థులు కాకినాడలోని ఎస్సీ, బీసీ సంక్షేమశాఖల కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఒకపక్క కాలేజీల యాజమాన్యాలు, మరోపక్క ప్రభుత్వ నిర్వాకం మధ్య విద్యార్థులు అడకత్తెరలో పోక చెక్కలుగా నలిగిపోతున్నారు. ఈ రకంగా గత విద్యా సంవత్సరంలో కూడా రెండు, మూడువేల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతి విద్యా సంవత్సరంలో ఇదే పరిస్థితి ఎదురవుతున్నా ప్రభుత్వం శాశ్వతప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం లేదు. కనీసం ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంపై దృష్టిపెట్టడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని విద్యార్థులను గట్టెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement