సబ్‌స్టేషన్‌ ఆప‘రేటు’ | substation oparator jobs for sale | Sakshi
Sakshi News home page

సబ్‌స్టేషన్‌ ఆప‘రేటు’

Published Mon, Jul 25 2016 11:37 PM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM

సబ్‌స్టేషన్‌ ఆప‘రేటు’ - Sakshi

సబ్‌స్టేషన్‌ ఆప‘రేటు’

  • ఉద్యోగాల కోసం చేతులు మారుతున్న లక్షలు
 
 
ఖమ్మం: విద్యుత్‌ అధికారులు కొందరు..ఆపరేటర్‌ నియామకాల్లో ‘పవర్‌’ చూపిస్తున్నారు. లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. డివిజన్‌ స్థాయిలో అనుకూలమైన వారికి ఎక్కువ మార్కులు వేసి, జాబితాలో పేర్లు చేర్చి..ఉద్యోగం ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నట్లు..ఆరోపణలొస్తున్నాయి. తక్కువ మార్కులొచ్చిన వారికీ కాల్‌ లెటర్లు రావడంపై..మెరిట్‌ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో నియామకాలపై చర్చ జరుగుతోంది.
విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలో ఆపరేటర్ల నియామకానికి రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల వరకు బేరసారాలు జరుగుతున్నాయనే ప్రచారముంది. ముందస్తుగా లక్ష వసూలు చేసి..ఉద్యోగం వచ్చాక మిగతా సొమ్ము స్వీకరించేలా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. గతంలో సబ్‌ స్టేషన్‌ స్థలదాత, స్థానిక ప్రజాప్రతినిధి, ట్రాన్స్‌కో అధికారులు, కాంట్రాక్టర్లు ఒక్కొక్కరికీ ఒక్కో పోస్టు చొప్పున పంచుకునేవారు. ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీగా పనిచేసిన కార్తికేయన్‌ మిశ్రా..కంపెనీ నిబంధనల ప్రకారమే చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఐటీఐలో సాధించిన మార్కులు, ఎంప్లాయిమెంట్‌ సీనియార్టీ, అప్రెంటీస్, కంపెనీలో పనిచేసిన అనుభవాలకు 70 మార్కులు, పోల్‌ క్లైంబింగ్‌కు 30 మార్కులు కేటాయించారు. 
  • 1:5 జాబితాపై అభ్యంతరాలు..
ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం డివిజన్లలో పలువురు అధికారులు కిందిస్థాయి నుంచి వరంగల్‌ కార్పొరేట్‌ ఆఫీస్‌వరకు మామూళ్లు చెల్లించాలని లక్షలు వసూలు చేసినట్లు పుకార్లు ఉన్నాయి. ఐటీఐలో మార్కులు ఎక్కువగా చూపించడం, కంపెనీలో పనిచేయకున్నా..సర్వీస్‌ ఉన్నట్లు మార్కులు జోడించారనే విమర్శలు ఉన్నాయి. నియామకాలకు సంబంధించి రూపొందించిన 1:5 జాబితాలో వారి పేర్లు చేర్చారు. ఈనెల 27నుంచి నిర్వహించే పోల్‌ క్లైంబింగ్‌ (విద్యుత్‌ స్తంభాలు ఎక్కడం), ఇంటర్వూ్యలకు హాజరు కావాలని అభ్యర్థులకు కాల్‌లెటర్స్‌ వచ్చాయి. అర్హత కలిగిన అభ్యర్థులు తమకంటే తక్కువ మార్కులున్న వారికి సైతం కాల్‌ లెటర్లు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 1:5 జాబితాను బహిర్గతం చేయకుండా అధికారులు గోప్యంగా ఉంచుతున్నారని, మార్కులు, వివరాలు అందరికీ తెలిసేలా ఉంచాలని అర్హత కల అభ్యర్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 
  • అధికారులు వర్సెస్‌ కాంట్రాక్టర్లు..
సబ్‌స్టేషన్‌ ఆపరేటర్ల నియామకాల్లో అధికారులకు, కాంట్రాక్టర్లకు మధ్య వైరం ఏర్పడింది. సబ్‌స్టేషన్‌ నిర్వహణ అంతా తమదేనని, ఆపరేటర్ల నియామకంలో తమ ప్రమేయం లేకుండానే..అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంపై కాంట్రాక్టర్లు తప్పుపట్టినట్లు తెలిసింది. సెలక్షన్‌ కమిటీలో కాంట్రాక్టర్‌ సభ్యుడిగా ఉన్నా..మెరిట్‌ జాబితా తయారీలో ప్రమేయం కరువైందని, డబ్బు వసూలు, పంపకాల విషయంలో అధికారులకు, కాంట్రాక్టర్లకు మధ్య విభేదాలు వస్తున్నట్లు చర్చ జరుగుతోంది. జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపించి, ఆపరేటర్ల నియామకాలను పారదర్శకంగా నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. 
  • దళారులను నమ్మొద్దు..
విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని మధ్యవర్తులు డబ్బు డిమాండ్‌ చేస్తే..నమ్మొద్దు. మొత్తం నిబంధనల ప్రకారమే నియమిస్తాం. దళారులు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఎవరైనా అభ్యర్థులు అన్యాయం జరిగినట్లు భావిస్తే ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో వచ్చి జాబితాను సరిచూసుకోవచ్చు. ప్రతిభ ఉన్నవారికి తప్పకుండా అవకాశం కల్పిస్తాం. 
–ధన్‌సింగ్, ఎస్‌ఈ
 
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement