విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద తొలగించడానికి ముందు వైఎస్సార్ విగ్రహం
విజయవాడలో అర్థరాత్రి వేళ చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు చర్య
సాక్షి, విజయవాడ/ అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం బరితెగించింది.. విజయవాడలో విధ్వంసకాండను విచ్చలవిడిగా కొనసాగి స్తోంది... ఆలయాలు, దర్గాలు నేలమట్టం చేసి దేవుళ్ల విగ్రహాలను నడిరోడ్డుపై పడేస్తున్న సర్కారు.. పేదల గుండెల్లో కొలువైన మహా నేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై కన్నేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక, భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూం ఎదుట ఉన్న వైఎస్ విగ్రహాన్ని బలవంతంగా తొలగిం చింది. అడ్డువచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్‌చేసి తరలించింది. మున్సిపల్ కార్పొరేషన్‌లో తీర్మానంతోపాటు అన్ని అనుమతులతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని.. ఎలాంటి నోటీసులు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
నగరం నిద్దరోతున్న వేళ...
కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞం స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పోలవరం ప్రాజెక్టు నమూనాతో 12 అడుగుల క్యాంస విగ్రహం ఏర్పాటుకు అనుమతిస్తూ విజయవాడ నగరపాలక సంస్థ పాలకమండలి 2010, ఏప్రిల్ 16న తీర్మానం చేసింది. అప్పటి కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ ఆమోదం మేరకు ఆర్ అండ్ బీ, పోలీసు శాఖలు అనుమతులు ఇచ్చాయి. ట్రాఫిక్‌కు ఇబ్బందులు రాకుండా కనకదుర్గమ్మ గుడికి వెళ్లే ఫ్లై ఓవర్ వద్ద ఓ మూలన 2011, సెప్టెంబర్ 2న ఏర్పాటు చేశారు. అనంతరం ఆ కూడలికి వైఎస్సార్ చౌక్ అనే పేరును మున్సిపల్ కార్పొరేషన్ ఖరారు చేసింది. ఆ భారీ వైఎస్ విగ్రహాన్ని తొలిస్తారని శుక్రవారం సాయంత్రం నుంచే ప్రచారం మొదలైంది.
శుక్రవారం రాత్రి 12 గంటలకు భారీగా పోలీసుల బలగాలతో పాటు రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, పార్టీ రాష్ర్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్, కార్పొరేటర్లు అక్కడికి చేరుకున్నారు. విగ్రహం తొలగించడానికి వీల్లేదని పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైఎస్సార్ విగ్రహం ఉన్న ఐలాండ్‌కు చేరుకొని విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కౌన్సిల్ తీర్మానం చేసి, అన్ని అనుమతులతో ఏర్పాటు చేసిన... రోడ్ల విస్తరణకు కాని, ట్రాఫిక్‌కు కాని ఏమాత్రం అంతరాయం కలిగించని విగ్రహాన్ని ఎందుకు తొలగిస్తున్నారని వంగవీటి రాధాకృష్ణ అధికారుల్ని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత పోలీసులు నాయకుల్ని, కార్యకర్తల్ని ఇష్టానుసారంగా ఈడ్చుకెళ్ళి వ్యానుల్లో పడేశారు. వంగవీటి రాధను పెనమలూరు స్టేషన్‌కు, జోగి రమేష్‌ను, ఉంగుటూరు స్టేషన్‌కు, కార్పొరేటర్లు, కార్యకర్తలను కంకిపాడు,ఉయ్యూరు స్టేషన్లకు బలవంతంగా తరలించారు. ఆరు పొక్లెయినర్లు, ఒక భారీ క్రేన్ సహయంతో తెల్లవారుజాము మూడు గంటలకు విగ్రహం తొలగింపును పూర్తి చేశారు. క్రేన్ సాయంతో విగ్రహాన్ని సమీపంలో ఉన్న ఫైర్ డీజీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేశారు.
దుగ్ధతోనే తొలగింపు: విజయవాడ ఆర్టీసీ బస్టాండు నుంచి రోజూ రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కనకదుర్గమ్మ దేవాలయానికి సాధారణంగా రోజుకు 25వేలమంది వరకు, ఆదివారాలు, పర్వదినాల్లో రోజుకు 40వేలమంది వరకు భక్తులు వస్తుంటారు. వాళ్లందరూ ఆ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు విగ్రహాన్ని చూసి వైఎస్సార్‌ను స్మరించుకునేవారు. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సహించలేకపోయారనే వాదన బలంగా వినిపిస్తోంది. చంద్రబాబు తన అధికారిక నివాసం నుంచి అదేమార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. అందుకే ఆయన పట్టుబట్టి మరీ వైఎస్ విగ్రహాన్ని తొలగించారని స్థానికులు చెబుతున్నారు.
అంతా గుట్టే
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం తొలగింపు వ్యవహారంలో విజయవాడ నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు అత్యంత గోప్యంగా వ్యవహరించారు. చివ రి నిమిషం వరకు కిందిస్థాయి అధికారులకు సమాచారాన్ని తెలియనివ్వలేదు. కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు సిటీప్లానర్ బి.శ్రీనివాసులు ఇద్దరు ఏసీపీలు, 12 మంది బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ల ఫోన్లకు రాత్రి 8 గంటల సమయంలో మెసేజ్ పెట్టారు. రాత్రి 11.30 గంటల తరువాత తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం వద్ద ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాల్సి ఉందని, అందరూ హాజరు కావాలన్నది అందులోని సారాంశం. అందరూ అక్కడకు చేరుకున్నాక వైఎస్ విగ్రహాన్ని తొలగించాలని అందుకే పిలిచినట్లు కమిషనర్ చెప్పారు.