వివరాలు వెల్లడిస్తున్న అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి
దొంగ దొరికాడు..
Published Wed, Oct 12 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM
గుంటూరు ఈస్ట్: బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసుకుని బైక్‌పై వెళ్లే వారి వద్ద దోపిడీకి పాల్పడే నిందితుడ్ని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద రూ. 12 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
అమరావతి రోడ్డు ముత్యాలరెడ్డినగర్‌కు చెందిన షేక్ హుస్సేన్ పదో తరగతితో చదువు ఆపేసి పురుగుల మందుల దుకాణంలో పని చేసి మానేశాడు. ఆ అనుభవంతో పట్నంబజారులో సొంతంగా పురుగుల మందుల వ్యాపారం చేసి దెబ్బతిన్నాడు. అనంతనం ఫైనాన్స్ వ్యాపారంలోనూ అప్పుల పాలయ్యాడు. ఇక అడ్డదారిలో డబ్బు సంపాదించడానికి పథకం వేశాడు. ఈ క్రమంలోఎక్కువ మొత్తం డ్రా చేసే బ్యాంకుల వద్ద రెక్కీ వేశాడు. 2015 నవంబరులో జిన్నాటవర్ సెంటర్‌లోని కరూర్ వైశ్యాబ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసి ఒంటరిగా వెళుతున్న వ్యక్తిని వెంటాడాడు. నాజ్‌సెంటర్‌లోని యాక్సెస్ బ్యాంకు అండర్‌గ్రౌండ్‌లో పార్కింగ్ చేసిన అనంతరం ట్యాంకు కవర్‌లోని రూ. 4.50 లక్షలు చోరీ చేశాడు. 2016 ఫిబ్రవరి 15వ తేదీ అదే బ్యాంకులో డబ్బులు డ్రా చేసి బైక్‌పై వెళుతున్న వ్యక్తిని వెంటాడి పొన్నెకల్లులోని పంచాయతీ కార్యాలయం వద్ద పార్కు చేసిన అనంతరం ట్యాంకు కవర్‌లోని రూ. 10 లక్షలు దొంగిలించారు. తిరిగి అదే బ్యాంకు వద్ద 2016 ఆగస్టు 18న మరో వ్యక్తిని వెంటాడి నల్లచెరువు తొమ్మిదో లైను బియ్యం షాపు వద్ద పార్కు చేసిన బైక్ కవర్‌లోని రూ. 4.50 లక్షలు చోరీ చేశాడు. సీసీ కెమెరాల పుటేజీలు స్పష్టంగా లేని కారణంగా పోలీసులు వివిధ కోణాల్లో ఈ వరుస చోరీలపై లోతుగా విచారించారు.
హుస్సేన్ నిందితుడని నిర్ధారించి అతని వద్ద రూ. 12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సొమ్మును నిందితుడు జల్సాలకు ఖర్చు పెట్టేశాడు. ఈ కేసు పురోగతిలో ప్రతిభ కనబర్చిన కానిస్టేబుల్ వెంకట్, ఐటీ కోర్ బాలాజీ, శ్రీధర్‌లకు ఎస్పీ రివార్డులు అందించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు సుబ్బరాయుడు, తిరుపాల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement