'కూలి'న బతుకులు
పెనుకొండ రూరల్ : పెనుకొండ నుంచి మడకశిరకు వెళ్లే ఘాట్ రోడ్డులో ఆటో బోల్తాపడి ఇద్దరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారని ఎస్‌ఐ జనార్దన్ తెలిపారు. ఆయన కథనం మేరకు... అడదాకులపల్లికి చెందిన పది మంది కూలీలు ఉపాధి పనుల కోసం మడకశిర ఘాట్ రోడ్డులోని కొండకు ఆటోలో బయలుదేరారు. గమ్యస్థానం చేరుకోగానే కూలీలను దింపేందుకు ఆటోను డ్రైవర్ కృష్ణానాయక్ ఎడమ నుంచి కుడి వైపునకు తిప్పేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది.
ఘటనలో ఆటోలో ఉన్న నాగన్న(65) అక్కడికక్కడే మృతి చెందారు. సావిత్రమ్మ(45), లక్ష్మీనరసమ్మబాయి(44), రత్నమ్మ(47), రామకిష్టప్ప(50) గాయపడగా, వారిని 108లో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సావిత్రమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతదేహలను పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఘటనా స్థలికి చేరుకుని ఎస్‌ఐ వివరాలు సేకరించారు.
రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
పెనుకొండ-మడకశిర మార్గంలో జరిగిన ఆటో ప్రమాదంలో మరణించిన అడదాకులపల్లికి చెందిన ఉపాధి కూలీలు కురుబ నాగప్ప, సావిత్రమ్మకు చెందిన ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉపాధి విభాగంలో ఉద్యోగం ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ డిమాండ్ చేశారు. ప్రమాద విషయం తెలియగానే పార్టీ కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, సర్పంచ్ సుధాకరరెడ్డితో కలసి ఆస్పత్రికి చేరుకున్నారు. మార్చురీలోని నాగప్ప మృతదేహాన్ని పరిశీలించారు. అనంతపురం ఆస్పత్రిలో మరణించిన మరో సావిత్రమ్మ మృతదేహానికి పోస్టుమార్టం జరిగిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.
డ్రైవర్, ఆటో యజమానిపై కేసులు
పెనుకొండ : నిర్లక్ష్యంగా ఆటో నడిపి ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్ అడదాకులపల్లికి చెందిన కృష్ణానాయక్ సహా ఆటో అమ్మినా, రికార్డులు మార్చి ఇవ్వనందుకు రామగిరి మండలం శేషాద్రి బట్రహళ్లికి చెందిన పరంధామపై 337, 304, 304(2) సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పెనుకొండ ఇన్‌చార్జ్ సీఐ టి.వెంకటేశులు విలేకరులకు తెలిపారు. వారిద్దరిపై హత్య గాని హత్య కేసు పెట్టామన్నారు.