అయిదేళ్ల కోసం అధికారం చేపట్టి ప్రారంభించిన ప్రయాణంలో ఏ ప్రభుత్వానికైనా తొలి ఏడాది కాలమూ పరీక్షా సమయమే. అది వేసే అడుగులపైనే అందరి దృష్టీ ఉంటుంది. అది తీసుకుంటున్న నిర్ణయాల్లోని మంచిచెడ్డలపై లోతైన చర్చ జరుగుతుంది. అందునా ఎన్నికల సమయంలో బీజేపీ తన ప్రచారహోరుతో ప్రత్యర్థులను గుక్కతిప్పుకోకుండా చేసింది గనుక జనంలో అంచనాలు కూడా భారీగా ఉంటాయి. ఇన్నిటిమధ్య పనితీరులో ఏ కొంచెం వెనకబడినట్టు కనబడినా అది తీవ్ర ప్రభావాన్నే చూపుతుంది. తొలి ఏడాదిలో సాధించిన విజయాలేమిటో... లోటుపాట్లేమిటో... ఎక్కడెక్కడ సరిదిద్దుకోవాల్సి ఉన్నదో విశ్లేషించుకుంటే మిగిలిన నాలుగేళ్ల కాలమూ మెరుగైన తీరును ప్రదర్శించడానికి పాలకులకు వీలవుతుంది. సాఫల్య వైఫల్యాల సమీక్ష పాలనకు చురుకుదనాన్ని తెస్తుంది.
ఏడాది కాలమన్నది రాజకీయాల్లో సుదీర్ఘమైనదే కావచ్చుగానీ ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చేందుకు ప్రభుత్వానికది స్వల్ప వ్యవధికిందే లెక్క. కనుక తొలి సంవత్సరమే అన్నీ నెరవేర్చలేకపోయిందని చెప్పడం సరికాదు. అందులోనూ బీజేపీ ఇచ్చిన హామీలు చిన్నవేమీ కాదు. విదేశీ పెట్టుబడులను రప్పించి, యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని... మలి దశ సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు తెస్తామని చెప్పింది.
అంతేకాదు...పాలనలో చోటుచేసుకుంటున్న జాప్యాన్ని నివారించి, అవినీతిని అంతమొందిస్తామని హామీ ఇచ్చింది. కనుకనే ప్రత్యేకించి యువత, మధ్యతరగతి మోదీకి నీరాజనాలు పట్టాయి. అదేవిధంగా పేద, బలహీనవర్గాలను ‘అచ్ఛేదిన్’ (మంచిరోజులు) నినాదం సమ్మోహనపరిచింది. వ్యవసాయాన్ని గిట్టుబాటయ్యేలా చేస్తామన్నందుకు రైతులు అండగా నిలిచారు. ఏడాది తర్వాత ఇప్పుడీ వర్గాలు నిరాశలోకి జారుకున్నాయనడం తొందరపాటే అవుతుందిగానీ...సంశయాలైతే చోటు చేసుకుంటున్నాయని చెప్పకతప్పదు.
ఈ ఏడాదికాలంలోనూ ఎన్డీయే సర్కారు ఎన్నో పథకాలను ప్రారంభించింది. జన్‌ధన్ యోజన మొదలుకొని జన్‌సురక్షా, స్వచ్ఛభారత్, మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా వరకూ అందులో ఎన్నో ఉన్నాయి. వీటి సాఫల్యవైఫల్యాల సంగతలా ఉంచి దేశ ఆర్థిక వ్యవస్థ కాస్త కోలుకున్న మాట వాస్తవం. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పినట్టు ద్రవ్యోల్బణం చాన్నాళ్ల తర్వాత అదుపులోకి వచ్చింది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరిగాయి. కరెంటు అకౌంటు లోటు గణనీయంగా తగ్గింది. రెవెన్యూ లోటు తగ్గుముఖంపట్టింది. జీడీపీ కూడా 7.5 శాతం దగ్గరుంది. అయితే ఇందుకు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పడిపోవడం కూడా కారణమని గుర్తించాలి. దౌత్యరంగంలో మోదీ సాధించిన విజయాలు ఎన్నదగ్గవి.
ఇక రైతుల వరకూ చూస్తే 50 శాతం పంటనష్టం జరిగిన సందర్భాల్లో మాత్రమే రైతుకు పరిహారం అందే పరిస్థితినుంచి 33 శాతం పంటనష్టానికి కూడా పరిహారం ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారు. పరిహారం మొత్తాన్ని కూడా పెంచారు. మధురలో సోమవారం నిర్వహించిన ర్యాలీ సందర్భంగా రైతులకు మరిన్ని మేళ్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మోదీ ప్రకటించారు. అయితే, అవి రైతులు ఆశించిన స్థాయిలో ఉంటాయా? సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో హోరెత్తించినంతగా సాకారమవుతాయా? పెను సంక్షోభంలో చిక్కుకున్న వ్యవసాయరంగానికి ఇప్పుడు కావాల్సింది అరకొర సాయం కాదు. ఇన్నాళ్లూ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో ఎక్కువగా కనబడే రైతుల ఆత్మహత్యలు బీహార్, యూపీ, రాజస్థాన్‌వంటి ప్రాంతాలకు పాకాయి.
సాక్షాత్తూ దేశ రాజధానిలోనే ఒక రైతు ఆత్మహత్యకు ఒడిగట్టాడు. వ్యవసాయంలో పెట్టుబడుల అవసరం పెరిగిపోవడం... అదే సమయంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం, సవాలక్ష నిబంధనలతో బ్యాంకుల్లో అప్పుపుట్టక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సిరావడం లాంటి కారణాలు అన్నదాతను అధోగతిలోకి నెట్టేస్తున్నాయి. అందువల్లనే రోజూ 2,035 మంది రైతులు ఆ రంగంనుంచి తప్పుకుంటున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే వెల్లడించింది. ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ఉత్పాదక ఖర్చు కంటే కనీసం 50 శాతం ఎక్కువగా ఉండాలని స్వామినాథన్ కమిషన్ సూచించింది. ఆ సూచనలను తాము అధికారంలోకొస్తే అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించింది. దాన్ని అమలు చేయకపోగా అది ఆచరణ సాధ్యం కాదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలుచేసింది. ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 10 శాతంపైగా కోత పడింది. ఇవన్నీ చాలనట్టు పారిశ్రామికాభివృద్ధికీ, రైతులనుంచి తీసుకునే భూములకూ పోటీపెట్టి భూసేకరణ చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రైతుల భూములను ప్రభుత్వాలు ఏకపక్షంగా స్వాధీనం చేసుకునేందుకు వీలు కల్పించింది. ఇలాంటి పోకడలు అసలే అంతంతమాత్రంగా ఉన్న రైతును మరింత కుంగదీస్తున్నాయి.
రైల్వే, రక్షణ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం, బీమా రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐకు వీలుకల్పించడం, న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం స్థానంలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టడం వంటివి ఈ ఏడాది కాలంలో తీసుకున్న కీలక నిర్ణయాలు. అయితే, అన్ని వర్గాలనూ కలుపుకొని వెళ్లలేని అశక్తత మోదీ సర్కారును పీడిస్తున్నది. భూసేకరణ ఆర్డినెన్స్‌పై సర్వత్రా వ్యతిరేకత ఉన్నదని తెలిసినా తన వైఖరిని మార్చుకోకపోవడం, మైనారిటీల్లో అభద్రతను కలిగించే ప్రకటనలు చేస్తున్న నేతలను అదుపు చేయలేకపోవడం, స్వచ్ఛంద సంస్థలపై అవసరానికి మించి ఆంక్షలు విధించి అసమ్మతి గొంతు నొక్కుతున్నారన్న అభిప్రాయాన్ని కలిగించడంవంటివి ప్రభుత్వ ప్రతిష్టను పెంచవు. ప్రధాన సమాచార కమిషనర్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ), లోక్‌పాల్ పదవులన్నీ చాన్నాళ్లుగా ఖాళీగా ఉన్నాయి. తాము కుంభకోణాలకు తావులేని పాలనను అందివ్వగలిగామని మోదీ చెప్పిన మాటల్లో వాస్తవమున్నా ఇలాంటి నిఘా వ్యవస్థలు చురుగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవడం అవసరం. అప్పుడు మోదీ ప్రభుత్వ నిష్కళంకత గురించి ఆయన చెప్పుకోనవసరంలేదు. ఆ వ్యవస్థలే మాట్లాడతాయి. రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఎన్డీయే సర్కారు తన లోటుపాట్లను సవరించుకుని ముందుకెళ్తుందని ఆశిద్దాం.